క్రీడలు

సైనీ నాణ్యమైన బౌలర్‌ :నెహ్రా

బెంగళూరు : రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫాస్ట్‌ బౌలర్‌ నవదీప్‌ సైనీలో మంచి నాణ్యమైన బౌలర్‌ ఉన్నాడని ఆ జట్టు కోచ్‌ ఆశిష్‌ నెహ్రా అన్నాడు. ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు నవదీప్‌ సైనీ స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపికైన సంగతి తెలిసిందే. 2018లో ఆర్సీబీ యాజమాన్యం సైనీని రూ.3 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. కానీ, గత సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు. ఈ సీజన్‌లో విశేషంగా ఆకట్టుకున్న సైనీ.. బెంగళూరు జట్టులో కీలక బౌలర్‌గా మారాడు. భారత జట్టు సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి నేరుగా ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా సైనీపై బెంగళూరు బౌలింగ్‌ కోచ్‌ నెహ్రా ప్రశంసలు జల్లు కురిపించాడు.

‘సైనీ.. మంచి వేగంతో బంతులు వేస్తున్నాడు. ఆత్మవిశ్వాసంతో మైదానంలో కనిపిస్తుంటాడు. అది సైనీకి బాగా కలిసొచ్చే అంశం. పరుగులు కొంచెం ఎక్కువగా ఇస్తున్నప్పటికీ ఒక మంచి బౌలర్‌ అయ్యేందుకు కావాల్సిన లక్షణాలన్నీ సైనీకి ఉన్నాయి. గంటకు 150కి.మీ వేగంతో బౌలింగ్‌ వేయగల బౌలర్‌గా భారత జట్టుకు బాగా ఉపయోగపడతాడు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న బౌలర్లలో ఒకవేళ ఎవరైనా గాయపడితే జట్టుకు అందుబాటులో మొదటి వరుసలో ఉండేది సైనీనే’ అని నెహ్రా పేర్కొన్నాడు.