క్రైమ్

సైదాబాద్‌లో పట్టపగలే అందరూ చూస్తుండగా దారి దోపిడీ

  • సైదాబాద్‌లో పట్టపగలే అందరూ చూస్తుండగా దారి దోపిడీ
  • అందరూ చూస్తున్నా తమకేమీ పట్టనట్టు వెళ్లిపోయిన వాహనదారులు
  • నిందితుల్లో ఒకరు అదుపులోకి

హైదరాబాద్‌లో దారుణాలు పెచ్చుమీరుతున్నాయి. దుండగులు పట్టపగలే బరితెగిస్తున్నారు. చూట్టూ జనాలు తిరుగుతున్నా తమకేం పట్టనట్టు దారుణాలకు ఒడిగడుతున్నారు. నడిరోడ్డుపై హత్యలు, దాడులతో బెంబేలెత్తిస్తున్నారు. ఒకదాని వెంట ఒకటి జరుగుతున్న ఈ ఘటనలు హైదరాబాద్ వాసులను బెంబేలెత్తిస్తున్నాయి.

తాజాగా, సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ దారి దోపిడీ అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. రోడ్డుపై వెళ్తున్న ఆటోను అడ్డుకున్న నలుగురు యువకులు దానిని ఆపారు. ఆటో డ్రైవర్ అర్జున్‌ను కిందికి దించి డబ్బులు డిమాండ్ చేశారు. అతడు ఎదురు తిరగడంతో విచక్షణ రహితంగా దాడిచేశారు. రోడ్డుపై పడేసి పిడిగుద్దులు కురిపించారు. ఇటుక రాయితో ముఖంపై బాదారు.

రోడ్డుపై వాహనాలు తిరుగుతున్నా, అందరూ వారి పక్క నుంచే వెళ్తున్నా ఏ ఒక్కరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. బాధితుడు అరుపులు ఎవరినీ కదిలించలేకపోయాయి. అతడిపై దాడి చేసిన అనంతరం, అతని వద్దనున్న డబ్బులు, సెల్‌ఫోన్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. సీసీటీవీలో రికార్డు అయిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫుటేజీ ఆధారంగా నిందితుల్లో ఒకరిని బబ్లూగా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. బాధితుడికి వైద్య చికిత్స అందిస్తున్నారు.