జాతీయం

సూపర్‌ మార్కెట్లలో పెట్రోల్‌, డీజిల్!

సూపర్‌మార్కెట్‌లో నిత్యావసర సరకులే కాదు, ఇక నుంచి పెట్రోల్‌, డీజిల్‌ కూడా మీరు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌లో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ దీనిపై చర్చించే అవకాశం ఉందని సంబధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. దీంతో సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాల్లో కూడా ఇంధనాన్ని కొనుగోలు చేయొచ్చు.

కొన్ని అధికారిక వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు.. దీనిపై ప్రభుత్వం కేబినెట్‌  ముందు ఒక ప్రతిపాదన ఉంచనుంది. కఠిన నిబంధనలు లేకుండా ప్రైవేటు కంపెనీలు రిటైల్ ఇంధన రంగంలోకి సులభంగా ప్రవేశించడానికి తగిన వెసులుబాట్లు కల్పించే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేయనుందని పేర్కొన్నాయి. దీంతో మల్టీ బ్రాండ్ దిగ్గజాలైన ఫ్యూచర్ గ్రూప్‌, రిలయన్స్‌, అంతర్జాతీయ సంస్థ సౌదీ అరామ్కో  భారత రిటైల్ ఇంధన రంగంలోకి సులభంగా కాలుమోపే అవకాశం ఉంది.