జాతీయం

సుష్మా స్వరాజ్ కన్నుమూత…..!

న్యూఢిల్లీ : తీవ్రమైన గుండెనొప్పి కారణంగా, గత రాత్రి న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు నేటి సాయంత్రం లోధీ రోడ్ లోని స్మశాన వాటికలో జరుగనున్నాయి. నిన్న రాత్రే ఆమె పార్థివ దేహాన్ని జంతర్ మంతర్ లోని నివాసానికి తరలించగా, అప్పటి నుంచి పలువురు ప్రముఖులు మృతదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పిస్తున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఆమె అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.
తొలుత ఆమె మృతదేహాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకూ కార్యకర్తలు, నేతల సందర్శనార్థం అక్కడ ఉంచనున్నారు. 3 గంటల తరువాత అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జంతర్ మంతర్ నుంచి బీజేపీ కేంద్ర కార్యాలయం, లోధీ రోడ్ కు వెళ్లే రహదారులను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
కేంద్రమాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతిపట్ల రాజ్యసభ సంతాపం ప్రకటించింది. సభ ప్రారంభంకాగానే సుష్మా మృతిపట్ల రెండు నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు.సుష్మా స్వరాజ్‌ ఆకస్మికంగా మరణించడం బాధాకరం. ఆమె మరణం తనతో పాటు దేశ రాజకీయాల్లో తీరని లోటు. ఉత్తమ పార్లమెంటేరియన్‌, సమర్థవంతమైన పరిపాలకురాలు, ప్రజావాణిని గట్టిగా వినిపించే నేత సుష్మా’ అని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు కొనియాడారు.