అంతర్జాతీయం

సుప్రీంకోర్టులో లాలూకు షాక్‌

దిల్లీ: ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. దాణా కుంభకోణం కేసులో లాలూకు బెయిల్‌ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

1990ల్లో బిహార్‌లో చోటుచేసుకున్న దాణా కుంభకోణానికి సంబంధించి పలు కేసుల్లో లాలూ దోషిగా తేలిన విషయం తెలిసిందే. లాలూ ప్రస్తుతం రాంచీలోని బిర్సా ముందా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. బెయిల్‌ కోసం లాలూ జనవరి 10న ఝార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించడంతో లాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది. బెయిల్‌ మంజూరు చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

లాలూ తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. 24 నెలల పాటు ఆయన జైల్లోనే ఉంటున్నారని.. ఈ కేసులో లాలూకు బెయిల్ ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కపిల్‌ సిబల్‌ కోరారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఆయనకు విధించిన జైలు శిక్షలతో పోలిస్తే 24 నెలలు పెద్ద విషయం కాదని’ పేర్కొంది.

లాలూకు బెయిల్‌ ఇవ్వొద్దని సీబీఐ నిన్న సుప్రీంకోర్టును కోరిన విషయం తెలిసిందే. ‘లాలూకు ఆరోగ్యం బాగోలేదంటే ఆయనను ఆసుపత్రిలో చేర్చాం. కానీ ఆయన ఆసుపత్రిలో కూర్చుని రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆరోగ్యం బాగోలేదని చెప్పిన వ్యక్తి ఇప్పుడు అంత ఫిట్‌గా ఎలా అయ్యారు? ఆయనకు బెయిల్‌ ఇస్తే ఎన్నికలను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది’ అని సీబీఐ తెలిపింది.