జాతీయం

సుప్రీంకోర్టులో కర్ణాటక స్పీకర్‌ అప్పీల్‌

కర్ణాటక అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలపై ఈ రోజులోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ రమేశ్ కుమార్‌ను గురువారం అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన కొన్ని గంటల్లోనే ఆయన సుప్రీంను ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు తాను కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను కలుస్తానని వెల్లడించారు. అయితే రాజీనామాలపై ఈ రోజే తన నిర్ణయం చెప్పలేనని న్యాయస్థానానికి సమర్పించిన పత్రంలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ఏదైనా ఒత్తిడితోనా లేక స్వచ్ఛందంగా రాజీనామాలు సమర్పిస్తున్నారా అనే అంశాన్ని పరిశీలించడానికి తనకు సమయం కావాలని కోరారు.
అయితే ఈ దరఖాస్తుపై విచారణను శుక్రవారం చేపట్టనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

తమ రాజీనామాలపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదని అసమ్మతి ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల్లోగా ఎమ్మెల్యేలందరూ స్పీకర్‌ రమేశ్ కుమార్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దీనిపై రేపటిలోపు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది.

రాజీనామాలపై వెనక్కి తగ్గం: అసంతృప్త ఎమ్మెల్యే బైరాతి బసవరాజ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను మేం గౌరవిస్తాం. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకే స్పీకర్‌ను కలిసి, రాజీనామాలను సమర్పిస్తాం. మా రాజీనామాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మా నిర్ణయానికి భాజపాకు ఏ సంబంధం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.