అంతర్జాతీయంజాతీయం

సుందర్‌ పిచాయ్‌కి ‘గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డు’

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కి అరుదైన గౌరవం దక్కింది. అమెరికా భారత వాణిజ్య మండలి(యూఎస్‌ఐబీసీ) ప్రతి ఏటా ఇచ్చే గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డును 2019కి గానూ సుందర్‌ పిచాయ్‌తో పాటు నాస్‌డాక్‌ అధ్యక్షుడు అడేనా ఫ్రైడ్‌మాన్‌ను ఎంపిక చేసింది. ప్రపంచ సాంకేతిక రంగ అభివృద్ధికి ఇరు కంపెనీలు అందిస్తున్న సేవలకు గానూ వారిని ఎంపిక చేసినట్లు మండలి పేర్కొంది. వచ్చే వారం జరగబోయే ‘ఇండియా ఐడియాస్‌’ సదస్సులో వారికి అవార్డును ప్రదానం చేయనున్నారు. గూగుల్‌, నాస్‌డాక్‌ కంపెనీల సహకారంతో 2018లో అమెరికా-భారత్‌ మధ్య వస్తుసేవల ద్వైపాక్షిక వాణిజ్యంలో 150శాతం మేర వృద్ధి చెందినట్లు యూఎస్‌ఐబీసీ వెల్లడించింది.

ఈ సందర్భంగా పిచాయ్‌ మాట్లాడుతూ.. గూగుల్‌ వృద్ధికి భారత్‌ ఎంతగానో తోడ్పాటునందిస్తోందన్నారు. ఈ క్రమంలో జరిగిన సాంకేతికాభివృద్ధితో ప్రజల జీవన విధానం ఎంతగానో మెరుగు పడిందని అభిప్రాయపడ్డారు. అలాగే నాస్‌డాక్‌ అధ్యక్షుడు ఫ్రైడ్‌మాన్‌ స్పందిస్తూ.. యూఎస్‌ఐబీసీ కృషితో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలతో పాటు సాంస్కృతిక బంధం కూడా బలపడుతోందని అభిప్రాయపడ్డారు. 2007 నుంచి ఇస్తున్న ఈ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డు.. ఇరు దేశాల వాణిజ్య బంధం బలోపేతానికి సహకరిస్తున్న కార్పొరేట్‌ కంపెనీల దిగ్గజాలకు ప్రదానం చేస్తూ వస్తున్నారు.