సినిమా

సినిమాలో రేపిస్ట్‌కి అవకాశం ఇస్తారా?

ముంబయి: బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌పై.. సినీ నటి తనుశ్రీ దత్తా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనుశ్రీ కారణంగా ‘మీటూ’ ఉద్యమానికి తెరలేచింది. దీని ద్వారా ఎందరో నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బయటపెట్టగలిగారు. ‘మీటూ’ నేపథ్యంలో ప్రముఖ రచయిత్రి వింటా నందా.. నటుడు అలోక్‌ నాథ్‌ నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. అలోక్‌ తనపై అత్యాచారం చేసినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో అజయ్‌ దేవగణ్‌.. తాను నటించిన ‘దే దే ప్యార్‌ దే’ చిత్రంలో అలోక్‌నాథ్‌కు అవకాశం ఇచ్చారు. దాంతో ఈ విషయం కాస్తా బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. నటీమణులకే కాదు ఆడవాళ్లకు మర్యాద ఇవ్వాలని, వారి పట్ల తప్పుగా ప్రవర్తించకూడదని చెప్పిన అజయ్‌.. రేపిస్ట్‌ అని తెలిసి కూడా అలోక్‌కు సినిమాలో అవకాశం ఇవ్వడంపై తనుశ్రీ మండిపడ్డారు.
మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘చిత్ర పరిశ్రమలో అందరూ అబద్ధాలకోరులే. ఇందుకు అజయ్‌ దేవగణే ఉదాహరణ అని చెప్పాలి. అలోక్‌నాథ్‌పై గతంలో ఓ మహిళ ఆరోపణలు చేసినప్పటికీ అతనికి ఎందుకు సినిమాలో అవకాశమిచ్చారు? మీకు (అజయ్‌ను ఉద్దేశిస్తూ) నిజంగానే అలోక్‌ చేసింది తప్పు అని తెలిసినప్పుడు అతను నటించిన సన్నివేశాలను తొలగించి మరో నటుడ్ని పెట్టుకోవచ్చు కదా! అది వదిలేసి రేపిస్ట్‌ని సినిమాలో పెట్టుకుంటారా? అలోక్‌కు మళ్లీ అవకాశం ఇచ్చింది అజయ్‌నే.  అతన్ని నిర్భయంగా సినిమా నుంచి తొలగించవచ్చు. కానీ ఆయన అలా చేయలేదంటే.. ఆ రేపిస్ట్‌కి మద్దతు ఇస్తున్నట్లేగా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తనుశ్రీ.
2018 అక్టోబర్‌లో వింటా నందా.. అలోక్‌పై కేసు వేశారు. దాంతో అలోక్‌ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వింటాతో పాటు ఎందరో నటీమణులు అలోక్‌పై లైంగిక ఆరోపణలు చేశారు. ఈ కేసు విచారణ ఇంకా జరుగుతోంది.