జాతీయం

సమాజ సేవలో ‘వాచ్‌మెన్‌’ చిత్రబృందం

టీనగర్‌: మహిళలపై లైంగిక వేధింపులను అడ్డుకోవడానికి ‘వాచ్‌మెన్‌’ చిత్ర బృందం పొల్లాచ్చిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. తాము కొనుగోలు చేసిన 50 సీసీ కెమెరాలను పోలీసులకు అప్పగించింది. పొల్లాచ్చిలో ఇటీవల మహిళలపై ఓ ముఠా లైంగిక దాడులు చేసిన వ్యవహారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ తరహాలో లైంగిక వేధింపులు కొనసాగకుండా అవగాహన కల్పించే నిమిత్తం ‘వాచ్‌మెన్‌’ చిత్ర బృందం ఈ చర్యలు చేపట్టింది. పొల్లాచ్చి లాగా అనేక ప్రాంతాల్లో బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్న నేపథ్యంలో ఆడపిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలనే అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తోంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాలు తగ్గుముఖం పడతాయని చిత్ర దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు తమ పిల్లల భద్రత దృష్ట్యా ఈ తరహా కెమెరాలను ఏర్పాటు చేయించడం శ్రేయస్కరమన్నారు. కెమెరాలు ఉన్నాయన్న భయంతో నేర్పాలకు పాల్పడేవారు వెనకడుగు వేస్తారన్నారు. జీవీ ప్రకాష్‌ మాట్లాడుతూ పొల్లాచ్చి మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా ‘డబుల్‌ మీనింగ్‌’ ప్రొడక్షన్స్‌ ఆధ్వర్యంలో అరుణ్‌మొళి మాణిక్కం నిర్మాణంలో ‘వాచ్‌మెన్‌’ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో జీవీ ప్రకాష్‌ కథానాయకుడుగా నటించారు. సంయుక్త హెగ్డే నాయిక. బ్రునో పేరుతో ఓ శునకం చిత్రంలో హల్‌చల్‌ చేస్తోంది.