ఆంధ్రప్రదేశ్

‘సభా నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం అదేనా?’

రాష్ట్రంలో కరవు పరిస్థితులు తలెత్తడానికి తెదేపా అసమర్థ పాలనే కారణమని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్రంలో కరవు పరిస్థితిపై శాసనసభలో సీఎం జగన్‌ ప్రసంగించిన తర్వాత బొత్స మాట్లాడారు. పలు ప్రాంతాల్లో తాగడానికి నీరు లేని దుస్థితికి తెదేపా పాలనే కారణమన్నారు. గత ఐదేళ్లతో పోలిస్తే ఇప్పటి ప్రతిపక్షానికి చాలా ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని బొత్స చెప్పారు. సభలో గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. సీఎం జగన్‌ ఉద్దేశిస్తూ ‘నా అనుభవమంత వయసు లేదు’ అంటూ చంద్రబాబు మాట్లాడటాన్ని బొత్స తప్పుబట్టారు. సభా నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం అదేనా అని ప్రశ్నించారు. ప్రజలు అవకాశమివ్వబట్టే జగన్‌ సీఎం అయ్యారని చెప్పారు. తెదేపా సభ్యులు సంయమనం పాటించాలని.. సభా సంప్రదాయాలను ఉల్లంఘించే వారిపట్ల స్పీకర్‌ కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. చంద్రబాబు ఎందుకు సహనం కోల్పోతున్నారో అర్థం కావడం లేదని బొత్స వ్యాఖ్యానించారు.