జాతీయం

సత్యం బాటలో ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌..

సత్యం కంప్యూటర్స్ మాదిరిగానే ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంస్థ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కన్పిస్తోంది. ఈ మధ్యాహ్నంలోగా కంపెనీ బోర్డును ప్రభుత్వం రద్దు చేసే అవకాశముంది. ఈ బోర్డు స్థానంలో తాత్కాలికంగా మరో బోర్డును ప్రతిపాదించనుంది. వివిధ రంగాల్లో విస్తరించిన ఈ ఇన్‌ఫ్రా కంపెనీ పీకలోతు నష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఈ కంపెనీ వ్యవహారాన్ని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) పరిశీలినకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ గ్రూప్‌ మొత్తం బకాయిలు రూ. 90,000 కోట్లు ఉండగా, వీటిలో బ్యాంకులు ఇచ్చిన రుణాలే రూ. 57,000 కోట్ల దాకా ఉన్నాయి. కంపెనీ పునర్‌ వ్యవస్థీకరిస్తే తాము మరో రూ. 3500 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వివిధ ఆర్థిక సంస్థలు పేర్కొనడంతో కంపెనీ మేనేజ్‌మెంట్‌ను మార్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. నిపుణులు కూడా ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సమస్య పరిష్కారానికి సత్యం తరహా పరిష్కారం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలుత సంస్థ బోర్డును ప్రభుత్వం మార్చనుంది.