క్రీడలు

సచిన్‌ను ప్రశంసించిన పాక్‌ క్రికెటర్

ఇంటర్నెట్‌ డెస్క్‌ : సచిన్‌ తెందుల్కర్‌.. ప్రపంచంలో ఈ పేరు తెలియని క్రికెటర్‌ గానీ క్రికెట్‌ అభిమాని గానీ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. తన బ్యాటింగ్‌తో రికార్డులను తిరగరాసిన ఈ మాస్టర్‌ బ్లాస్టర్‌.. ప్రత్యర్థి జట్లలోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే, తాజాగా మరో క్రికెటర్‌ సచిన్‌ అభిమానుల జాబితాలో చేరిపోయాడు. మన దాయాది దేశమైన పాకిస్థాన్‌ క్రికెటర్‌ అహ్మద్‌ షాజాద్‌.. సచిన్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు. క్రికెట్‌ ప్రపంచంలో సచిన్‌ ఎప్పటికీ అత్యుత్తమ బ్యాట్స్‌మనే అని పేర్కొన్నాడు. షాజాద్‌ తన అభిమానులకు ట్విటర్‌ వేదికగా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. సచిన్‌ గురించి కొన్ని మాటలు చెప్పండి అంటూ.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఉత్తమ బ్యాట్స్‌మన్‌, ఆదర్శప్రాయుడు, అన్నింటికంటే అత్యుత్తమ మానవత్వం ఉన్న వ్యక్తి.. అందరినీ ఒకేలా గౌరవిస్తారు’ అని పేర్కొన్నాడు. పాకిస్థాన్‌ జట్టులో కీలక ఆటగాడైన షాజాద్‌ రాబోయే ప్రపంచకప్‌లో రాణించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు.