జాతీయం

శ్రేయా ఘోషల్‌కు చేదు అనుభవం

ముంబయి: ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్‌కు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. సింగపూర్‌  బయలుదేరిన శ్రేయ .. తనతో పాటు ఓ వాయిద్య పరికరాన్ని కూడా తీసుకొచ్చారు. కానీ ఇందుకు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది ఒప్పుకోలేదు. పరికరాన్ని విమానంలోకి తీసుకురాకూడదని చెప్పారు. దాంతో తప్పని పరిస్థితుల్లో శ్రేయ తన పరికరాన్ని విమానాశ్రయంలోనే వదిలేశారు.
ఈ మేరకు ఆమె ట్విటర్‌ ద్వారా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ మ్యుజిషియన్స్‌ వద్ద విలువైన వాయిద్య పరికరాలుంటే విమానంలోకి ఎక్కనివ్వదేమో..! మంచిది. ధన్యవాదాలు. నాకు గుణపాఠం చెప్పారు’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ చూసిన ఎయిర్‌లైన్స్‌ సంస్థ శ్రేయకు క్షమాపణలు చెప్పింది. ‘శ్రేయా.. మీ పట్ల ఇలా జరిగినందుకు చింతిస్తున్నాం. అసలేం జరిగిందో.. మా సిబ్బంది మీతో ఏమన్నారో కాస్త వివరంగా చెప్తారా?’ అని పేర్కొంది. ఈ ఘటనపై శ్రేయకు అభిమానుల నుంచి మద్దతు లభించింది. విషయం ఎంతో సీరియస్‌ అయితే కానీ ఆమె ఇలా ట్వీట్ చేయరంటూ ఎయిర్‌లైన్స్‌పై కామెంట్లు చేస్తున్నారు.