జాతీయం

శ్రీలంక ఉగ్రదాడి ఇస్లామిక్‌ స్టేట్‌ ముష్కరుల పనే

కైరో: శ్రీలంక దారుణ మారణకాండ తమ పనేనని అరాచక ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఐఎస్‌ భావజాలం ప్రసారం చేసే అమాక్‌ వార్తా ఏజెన్సీలో ద్వారా ఈ విషయం వెల్లడించింది. అయితే ఇందుకు తగిన ఆధారాలు మాత్రం చూపలేదు. ‘శ్రీలంకలో మొన్న క్రైస్తవ బృందాలపై ఘోర దాడులు చేపట్టింది ఇస్లామిక్‌ స్టేట్‌ బృందం యోధులే’ అని అందులో ప్రకటించింది. కాగా దీనిపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఈస్టర్‌ పర్వదినాన క్రైస్తవులు ప్రార్థన చేస్తుండగా సంభవించిన వరుస బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 321కి చేరింది. 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల సంఖ్య 45 అని యూనిసెఫ్‌ వెల్లడించింది.