క్రైమ్తెలంగాణ

శ్రావణి హత్య.. శ్రీనివాస్‌ ఇంటికి నిప్పు

హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో ఉద్రిక్తపరిస్థితులు కొనసాగుతున్నాయి. శ్రావణి హత్యకేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ఇంటిని గ్రామస్థులు చుట్టుముట్టారు. పోలీసు భద్రత ఉన్నప్పటికీ ఇంటిపై దాడి చేసి నిప్పంటించారు. దీంతో ఇంటిముందున్న పందిరి కాలిపోయింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

శ్రావణితోపాటు కల్పన, మనీషా హత్యలకు కూడా శ్రీనివాస·రెడ్డే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతను కీసర నుంచి శ్రావణిని బైక్‌పై తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజీలు లభ్యం కావడంతో వారి అనుమానం బలపడింది. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఇతనికి గతంలో నేరచరిత్ర ఉంది. కర్నూలులో ఓ మహిళను అంతమొందించినట్లు కేసు నమోదైంది. ఇక్కడ మృతదేహాలు లభ్యమైన బావి అతనిదే కావడంతో హత్యలు అతనే చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. శ్రావణిని అంతమొందించే ముందు అత్యాచారం చేసినట్లు వైద్యుల ప్రాథమిక నివేదిక వెల్లడించడంతో మనీషానూ ఇదే రీతిలో శ్రీనివాసరెడ్డి చంపి ఉంటాడనుకుంటున్నారు. బొమ్మలరామారం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాజీపూర్‌కు ఎక్కువగా కాలినడకనే ఆధారపడటాన్ని నిందితుడు తనకు అనుకూలంగా మలుచుకుని ఉంటాడని భావిస్తున్నారు. మనీషాను హత్య చేసి రోజులు గడుస్తున్నా బహిర్గతం కాకపోవడాన్ని ఆసరాగా తీసుకొని శ్రావణిని లక్ష్యంగా చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

నాటి హత్యోదంతంపై పోలీసుల ఆరా
కర్నూలులో 2016లో ఓ మహిళను హత్య చేసిన కేసులో శ్రీనివాసరెడ్డి ప్రధాన నిందితుడు. రాచకొండ కమిషనరేట్‌ సీఐ అశోక్‌ సోమవారం కర్నూలు వచ్చి హత్యోదంతం గురించి ఆరా తీశారు. కర్నూలు నగరం వెంకటరమణ కాలనీలోని బిర్వారీ అపార్టుమెంటు పెంట్‌హౌస్‌ని శ్రీనివాసరెడ్డి అద్దెకు తీసుకుని ఉంటూ ఓ గుత్తేదారు వద్ద పనిచేసేవాడు. 2016, డిసెంబరు 27న అతను ఓ మహిళను గదికి తీసుకొచ్చాడు. అనంతరం ఆమెతో డబ్బు విషయంలో తేడా రావడంతో తన నలుగురు మిత్రులతో కలిసి ఆమెను చంపేశాడు. మృతదేహాన్ని పెంట్‌హౌస్‌పైన ఉన్న నీళ్ల ట్యాంకులో పడేసి పరారయ్యారు. పోలీసులు నిందితులను 2017, మే 16న అరెస్టు చేశారు. సదరు హతురాలు ఎవరన్నది మిస్టరీగానే ఉండిపోయింది.