అంతర్జాతీయంజాతీయం

శంషాబాద్‌లో ఇకపై ‘ఫేస్‌ రికగ్నిషన్‌’

మీరెప్పుడైనా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానమెక్కి ఇతర ప్రాంతాలకు వెళ్లారా? అప్పుడు ప్రవేశమార్గంలో తనిఖీల క్రమంలో బోర్డింగ్‌ పాస్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు పత్రం చూపించే ఉంటారు కదా. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే మిమ్మల్ని లోపలికి అనుమతించడం గుర్తుండే ఉంటుంది. అయితే సమీప భవిష్యత్తులో ఆ అవసరం ఉండబోదు. అక్కడ ఉండే కెమెరా వైపు చూస్తే చాలు ఎలాంటి పత్రాలు చూపకుండానే లోపలికి వెళ్లేందుకు మీకు అనుమతి లభిస్తుంది. అదే ‘ఫేస్‌ రికగ్నిషన్‌’ (ముఖ గుర్తింపు)’ విధానం. ఇప్పటికే ఈ పద్ధతిని జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం(గెయిల్‌) సంస్థ తన సిబ్బంది విషయంలో ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ఈక్రమంలో దేశంలోనే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసిన తొలి విమానాశ్రయంగా గెయిల్‌ ఖ్యాతి పొందింది. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో ఎయిర్‌లైన్స్‌, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సిబ్బందికీ వర్తింపజేశారు. ఇదీ ఫలవంతంగా కొనసాగుతుండటంతో మరికొద్ది రోజుల్లోనే విమాన ప్రయాణికులకూ వర్తింపజేయనున్నారు. దేశీయ ప్రయాణికులకు శంషాబాద్‌ విమానాశ్రయం గత రెండేళ్లుగా పత్రాలు అవసరం లేని(పేపర్‌లెస్‌) ప్రయాణానికి అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ముఖ గుర్తింపు విధానాన్ని అమలు చేయగలిగితే సమయం కలిసి వస్తుంది. తనిఖీల క్రమంలో విమానాశ్రయ ప్రవేశ మార్గంలో వేచి ఉండాల్సిన అవసరం తప్పనుంది. దీనికితోడు సమీప భవిష్యత్తులో ఆధార్‌ అనుసంధాన ప్రయాణాల్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గెయిల్‌ ప్రయత్నాలు చేస్తుండటం విశేషం.

రద్దీని అధిగమించేందుకు ఉపయుక్తం
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ ఏటా పెరుగుతూ వస్తోంది. గత ఏడాది ఏకంగా 2కోట్ల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. దీనికితోడు రాబోయే రోజుల్లో విమానాశ్రయ సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకు అవసరమైన నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈక్రమంలో విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం గతేడాది ఆగస్టులో డిపార్చర్‌ టెర్మినల్‌, దేశీయ ప్రయాణికుల రాక కోసం గత మార్చి 23న అరైవల్స్‌ టెర్మినల్‌లను తాత్కాలికంగా అందుబాటులోకి తెచ్చారు. విమానాశ్రయ సామర్థ్యం పొడిగింపు పనులు పూర్తయితే రద్దీ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో వీలైనంత మేరకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సదుపాయాల్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో భాగంగానే త్వరలోనే ముఖ గుర్తింపు విధానాన్ని అమలు చేసే ప్రయత్నాల్లో తలమునకలయ్యారు.

వన్‌టైం రిజిస్ట్రేషన్‌ ఇలా..
• తొలిసారిగా విమానం ఎక్కే ప్రయాణికుడు ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో వన్‌టైం రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును అక్కడి కంప్యూటర్‌ తెరపై ప్రదర్శించాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రయాణికుడి ముఖాన్ని కెమెరా ఫొటో తీస్తుంది.
• ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత అక్కడ విధులు నిర్వర్తించే సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది గుర్తింపు కార్డును మరోసారి తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు.
• అలా తొలిసారి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయితే ప్రయాణికుడి మెయిల్‌ ఐడీకి క్యూఆర్‌/ఫేస్‌ కోడ్‌ వస్తుంది. విమానాశ్రయంలో ఉండే ఈ-గేట్‌ వద్ద గల తెరపై ఈ కోడ్‌ను స్కాన్‌ చేస్తే ప్రయాణికుడి వివరాలు తెరపై కనిపిస్తాయి. ఆ వివరాలు సెంట్రల్‌  సర్వర్‌లో నిక్షిప్తమవుతాయి.
• రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకున్న ప్రయాణికుడు ఈ-గేట్‌ వద్ద బిగించి ఉన్న కెమెరా వైపు చూస్తే చాలు క్షణాల్లో గుర్తిస్తుంది. వెంటనే ప్రయాణికుడు లోపలికి వెళ్లేందుకు అక్కడి గేట్‌ తెరుచుకుంటుంది.
• అలా రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత మరోసారి విమానాశ్రయానికి వెళ్లినపుడు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి.. కెమెరావైపు చూస్తే తక్షణమే గేట్‌ తెరుచుకుంటుంది.