జాతీయం

వ్యక్తి దారుణ హత్య.. సీసీ కెమెరాలో దృశ్యాలు

ఘట్కోపర్‌ : ముంబయిలోని ఘట్కోపర్‌ ప్రాంతంలో సోమవారం పట్టపగలే నడిరోడ్డుపై 40 ఏళ్ల ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బబ్లూ దూపేయి అలియాస్‌ చోటీ అనే వ్యక్తి రహదారి పక్కన నిలబడి ఉన్న సమయంలో ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఇద్దరు వ్యక్తులు బబ్లూను పట్టుకోగా.. మరో వ్యక్తి విచక్షణా రహితంగా పొడిచాడు. ఆ తర్వాత ముగ్గురు పరారయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచాడు. బబ్లూపై హత్యాయత్నం సహా నాలుగు క్రిమినల్‌ కేసులు ఉన్నాయని చెప్పిన పోలీసులు.. పాత కక్షలే హత్యకు దారితీశాయని తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశామని.. మరొకరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.