ఆంధ్రప్రదేశ్

వైవీఎస్‌ చౌదరి కావాలనే అలా చేశారు

హైదరాబాద్‌: దర్శకుడు వైవీఎస్‌ చౌదరి తనపై కావాలనే చెక్‌ బౌన్స్‌ కేసు వేశారని అంటున్నారు ప్రముఖ నటుడు, వైకాపా నేత మోహన్‌బాబు. చెక్‌ బౌన్స్‌ కేసులో హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ న్యాయస్థానం ఏడాది పాటు మోహన్‌బాబుకు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెయిల్‌ కూడా మంజూరైంది. అయితే ఈ కేసుకు సంబంధించి మోహన్‌బాబు ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. ‘2009లో ‘సలీమ్‌’ సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమాకు కావాల్సిన మొత్తం పారితోషికాన్ని దర్శకుడు వైవీఎస్‌ చౌదరికి చెల్లించేశాం. మా బ్యానర్‌లోనే మరో సినిమా చేయడానికిగానూ ఆయనకు రూ.40 లక్షల చెక్‌ ఇచ్చాం. ‘సలీమ్‌’ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో చౌదరితో చేయాల్సిన మరో సినిమాను వద్దనుకున్నాం. సినిమా చేయడం లేదని చౌదరికి చెప్పాం. చెక్‌ను బ్యాంక్‌లో వేయొద్దని కూడా చెప్పాం. అయినా కూడా కావాలనే చెక్‌ను బ్యాంక్‌లో వేసి బౌన్స్‌ చేశారు. నాపై చెక్‌ బౌన్స్‌ కేసు పెట్టి కోర్టును తప్పుదోవ పట్టించారు. దాంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పుని సెషన్స్‌ కోర్టులో ఛాలెంజ్‌ చేస్తున్నాం. కొన్ని వార్తా ఛానల్స్‌లో మాపై వస్తున్న తప్పుడు ఆరోపణలను నమ్మొద్దు’ అని పేర్కొన్నారు.