క్రైమ్

వైకాపా నేత తోటలో భారీగా మద్యం స్వాధీనం

వి.కోట: చిత్తూరు జిల్లా వి.కోట మండల పరిధి కుంభార్లపల్లె వద్ద మామిడితోటలో శుక్రవారం రాత్రి పోలీసులు 170 మద్యం కేసులను పట్టుకున్నారు. ఈ తోట యజమాని శ్రీరాములురెడ్డికి వైకాపా నాయకుడిగా గుర్తింపు ఉంది. మామిడితోటలో మద్యం నిల్వలు ఉన్నట్లు పోలీసులకు శుక్రవారం రాత్రి సమాచారం అందింది. దీంతో అక్కడికి వచ్చి గాలించగా 170 మద్యం కేసుల్లో దాదాపు 8,160 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో పంపిణీకి వీటిని ఇక్కడ నిల్వ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీటి విలువ రూ.6 లక్షలు ఉంటుందని సీఐ పేర్కొన్నారు. మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని తోట యజమాని శ్రీరాములురెడ్డిపై కేసు నమోదు చేసినట్లు  చెప్పారు.