ఆంధ్రప్రదేశ్

వైకాపా దాడి.. సొమ్మసిల్లిన కోడెల

సత్తెనపల్లి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. సత్తెనపల్లి నియోజకవర్గంలోని యనమెట్ల గ్రామంలో వైకాపా నాయకులు బీభత్సం సృష్టించారు. సభాపతి కోడెల శివప్రసాదరావుపై వైకాపా స్థానిక నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలింగ్‌ సరళి పరిశీలనకు వచ్చిన కోడెలపై వైకాపా కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేశారు. కోడెల చొక్కా చింపేశారు. ఈ దాడిని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల ఫోన్లు లాక్కొని చితకబాదారు. ఈటీవీ ప్రతినిధి విజయ్‌ వద్ద ఉన్న కెమెరా, సెల్‌ఫోన్లు లాక్కొని ధ్వంసం చేశారు.  ఈ దాడిలో కోడెల సొమ్మసిల్లి పడిపోయారు. దాడి అనంతరం కోడెలను అక్కడి నుంచి తరలించారు. ఈ గ్రామంలో వైకాపా ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో అంతా ఏకమై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. పోలీసుల బందోబస్తు తక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో మరింత మంది భద్రతా సిబ్బందిని ఈ ప్రాంతానికి తరలించారు.