ఆంధ్రప్రదేశ్క్రైమ్

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో తాజా అప్‌డేట్

ప్రొద్దుటూరు: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందనరెడ్డి హత్య కేసులో నిందితులు ఎర్ర గంగిరెడ్డి, పీఏ క్రిష్ణారెడ్డి, డ్రైవర్‌ ప్రసాద్‌బాబులను సోమవారం పోలీసులు కడప జిల్లా ప్రొద్దుటూరు సెకెండ్‌ ఏడీఎం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వర్గాల వివరాల మేరకు… మార్చి 15న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురి కాగా, ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనే కారణంగా ఎర్ర గంగిరెడ్డి, ఏపీ క్రిష్ణారెడ్డి, డ్రైవర్‌ ప్రసాద్‌బాబులపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. కాగా ఈ కేసులో ఈ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు. వీరు ప్రస్తుతం కడప సెంట్రల్‌ జైలులో ఉంటున్నారు. ఈ కేసు విచారణ పులివెందుల కోర్టులో జరుగుతోంది. అయితే పులివెందుల మేజిస్రేట్‌ సెలవుపై వెళ్లగా ఇన్‌చార్జిగా జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ కూడా సెలవుపై వెళ్లడంతో రిమాండు పొడిగింపు నిమిత్తం పోలీసులు ప్రత్యేక బందోబస్తుతో ప్రొద్దుటూరు కోర్టుకు ముగ్గురు నిందితులను తీసుకొచ్చారు. సెకండ్‌ ఏడీఎం కోర్టులో మేజిస్ట్రేట్‌ ముందు నిందితులు ఎర్రగంగిరెడ్డి, పీఏ క్రిష్ణారెడ్డి, డ్రైవర్‌ ప్రసాద్‌బాబులను హాజరుపరచగా సెకండ్‌ ఏడీఎం తదుపరి విచారణ మే 6కు వాయిదా వేసినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. దీంతో నిందితులను తిరిగి కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు.