క్రీడలు

వెస్టిండీస్‌ టూర్ కు జట్టు ఎంపిక నేడే

వెస్టిండీస్‌తో భారత గడ్డపై జరిగే రెండు టెస్టుల సిరీస్‌ కోసం భారత జట్టును ఈరోజు ఎంపిక చేయనున్నారు. టీమిండియా జట్టును ఎంఎస్‌కే ప్రసాద్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ బుధవారం ఎంపిక చేసినా..  ఆసియా కప్ ఫైనల్ తర్వాతే ప్రకటించనున్నారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇంగ్లండ్‌ పర్యటనలో ఘోరంగా విఫలమైన ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో వేరొకరికి చోటు కల్పిస్తే.. ఆ ప్రభావం ఫైనల్ ఆటపై పడుతుందని అధికారిక ప్రకటనను వాయిదా వేసినట్లు సమాచారం. మరోవైపు ప్రధాన పేసర్ ఇషాంత్‌శర్మ గాయంతో బాధపడుతుండ‌గా.. ఆఫ్‌స్పిన్నర్ అశ్విన్ ఫిట్‌నెస్‌పై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ఇది కూడా వాయిదాకు మరో కారణం.

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 4-1 తేడాతో సిరీస్ కోల్పోవడంతో జట్టులో చాలా మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. గాయపడిన ఇషాంత్, అశ్విన్ స్థానాల్లో మరొకరికి ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.  పేస్ లో భువి, బుమ్రా, షమీలకు అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యాకు గాయమవడంతో హనుమ విహరికి చోటు కాయం. స్పిన్ లో జడేజా, చాహల్, కుల్దీప్ లకు చోటు కాయం కాగా అక్షర్ కూడా రేసులో ఉన్నాడు. ఇంగ్లండ్‌ సిరీస్‌లో ఘోరంగా విఫలమయినా.. ఆసియా కప్ లో పరుగుల వరద పారిస్తున్న ధావన్ ఎంపికపై ఆసక్తి నెలకొంది. చివరి టెస్టులో సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ స్థానంకు ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చు. విరాట్, పుజారా, రహానేలు కొనసాగుతారు. సాహా గాయం కారణంగా రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ లకు కూడా చోటు దక్కొచ్చు. బెంచ్ ఓపెనర్ గా విజయ్ కూడా జట్టులోకి రానున్నాడు.