తెలంగాణ

వెలుగులోకి జయరాం హత్యకేసు చార్జ్‌షీట్‌!

సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎన్‌ఆర్‌ఐ చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ వెలుగులోకి వచ్చింది. చార్జ్‌షీట్‌లో ముగ్గురు పోలీస్‌ అధికారుల పేర్లను నిందితులుగా పొందుపరిచారు. హనీట్రాప్ ద్వారా యువతి పిలిచినట్టుగా నాటకమాడి జయరాంను రప్పించారని అందులో పేర్కొన్నారు. చిత్రహింసలు పెట్టి హత్య చేసిన రాకేశ్ రెడ్డి.. ఆపై మృతదేహాన్ని తెలంగాణ సరిహద్దులు దాటించాడని 23 పేజీల చార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు.
12 మంది నిందితులతో పాటు 73 మంది సాక్షుల పేర్లను దీనిలో ప్రస్తావించారు. ఈ కేసులో నిందితులుగా రాకేష్‌ రెడ్డి, విశాల్, వాచ్‌మెన్‌ శ్రీనివాస్, రౌడీ షీటర్ నగేశ్.. నటుడు, కమెడియన్ సూర్యప్రసాద్, అతని స్నేహితుడు కిశోర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి సుభాష్ రెడ్డి, టీడీపీ నేత బీఎన్ రెడ్డి, వ్యాపారి అంజిరెడ్డి, నల్లకుంట మాజీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు, రాయదుర్గం మాజీ ఇన్‌స్పెక్టర్ రాంబాబు, ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ మల్లారెడ్డిలను నిందితులుగా పేర్కొనగా.. జయరాం మేనకోడలు శిఖా చౌదరిని 11వ సాక్షిగా చార్జ్‌షీట్‌లో ప్రస్తావించారు.