తెలంగాణ

వీసా కోసం రిజిస్టర్‌ వివాహం

హైదరాబాద్‌: ఆ ఇద్దరూ సాప్ట్‌వేర్‌ ఉద్యోగులే.. ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ కెనడా వీసా రావాలంటే వివాహం అయినట్టుగా ధ్రువపత్రం అవసరం. దాంతో ఆ యువకుడు వివాహ ఘట్టాన్ని కూడా ముగించాడు. సంప్రదాయబద్ధంగా కాకుండా రిజిస్టర్‌ వివాహం చేసుకొని కెనడా వీసా పొందాడు. అంతే ఆ తర్వాత నుంచి ముఖం చాటేశాడు. ఏడాది కావొస్తున్నా మూడు ముళ్లు వేయలేదనే సాకుతో తప్పించుకు తిరుగుతున్నాడు. విసిగెత్తిపోయిన యువతి ఉప్పల్‌ పోలీసులను ఆశ్రయించింది. ఉప్పల్‌లోని కల్యాణపురికి చెందిన ఓ యువతికి నగరంలోని కాచిగూడకు చెందిన అరవిందకుమార్‌తో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలనుకుని పెద్దలను ఒప్పించారు. అదే పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగింది. వివాహం తర్వాత చేసుకోవాలనుకున్నారు. కానీ ఈలోపే అరవింద్‌ కెనడా వీసా పొందేందుకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్టర్‌ వివాహం చేసుకున్నాడు. వీసా వచ్చిన తర్వాత వివాహాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఇటీవల గట్టిగా అడగటంతో ముఖం చాటేశాడు. దాంతో మోసపోయానని భావించిన ఆ యువతి బుధవారం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఫిర్యాదు చేసినట్టుగా లేదా కేసు నమోదైనట్టుగా కూడా సమాచారం లేదంటున్నారు.