ఆంధ్రప్రదేశ్

విశాఖ వారికి చేతకాదట!

ఇది ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌లో తిరుగుతున్న కోచ్‌. సెంట్రల్‌ రైల్వేకి చెందిన పాతది తీసుకొచ్చి ఈ రైలుకు అతికించారు. పైగా దీన్ని విశాఖకే కేటాయించినట్టు కూడా నమోదు చేయించారు. ఈ రైలుపై పసుపురంగు గీతకు కుడివైపున సీఆర్‌ (సెంట్రల్‌ రైల్వే) అని ఉన్న గుర్తును, ఎడమవైపు విశాఖకు చెందినట్లుగా (వీఎస్‌కేపీ) ఉన్న గుర్తుల్ని గమనించవచ్ఛు

ఇది కూడా ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ రైలు కోచే. 10-12 ఏళ్ల కిందటి పాతది. పూరీకి చెందిన దీన్ని తీసుకొచ్చి ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌కు అంటగట్టారు. ఇక్కడ పీయూఐ అనే ఆధారాన్ని కూడా చూడొచ్ఛు పూరీకి గతంలో పీయూఐ అనే కోడ్‌ ఉండేది. ఇప్పుడు పీయూఆర్‌ఐగా మార్చారు.

ఇవి మన ముఖాన..

ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌కు 4 రేక్‌లు (రైళ్లు) ఉన్నాయి. ఇందులో రెండు రేక్‌లను ‘ఈనాడు’ స్వయంగా పరిశీలించింది. అన్నిటిలోనూ విశాఖకు కేటాయించిన రేక్‌లు మాత్రమే ఉండాలి. వీటి వాటా మొత్తం కోచ్‌ల్లో కేవలం 18 శాతం మాత్రమే. రేక్‌-1లో 16 కోచ్‌లుండగా ఇందులో 13 విశాఖకు చెందినవి కావు. రేక్‌-4లో ఉన్న 16 కోచ్‌ల్లో 12 విశాఖవి కావు. 10-15 ఏళ్ల పాతబడ్డవాటిని అంటగట్టేశారు.

* మన కోచ్‌లు.. వారి రైళ్లకు

న్యాయంగా విశాఖ రైళ్లకు చెందిన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లన్నింటినీ భువనేశ్వర్‌, పూరీకి తరలించేశారు. అక్కడి నుంచి మొదలయ్యే రైళ్లకు అతికించేసి వాడుతున్నారు. విశాఖ మీదుగా రాకపోకలు సాగిస్తున్న రైళ్లను ‘ఈనాడు’ పరిశీలించి మన కోచ్‌లను గుర్తించింది.

* భువనేశ్వర్‌ – రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ (18495/96)

* భువనేశ్వర్‌ – బెంగళూరు కంటోన్మెంట్‌ సూపర్‌ఫాస్ట్‌ (12845/46)

* భువనేశ్వర్‌ – పుణె సూపర్‌ఫాస్ట్‌ (22881/82)

* భువనేశ్వర్‌ – తిరుపతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22871/72)

* భువనేశ్వర్‌ – తిరుపతి సూపర్‌ఫాస్ట్‌ (22879/80)

* భువనేశ్వర్‌ – పుదుచ్చేరి సూపర్‌ఫాస్ట్‌ (12897/98)

(గమనిక 1: పైవన్నీ కేవలం విశాఖ స్టేషన్‌ మీదుగా వెళ్లేవి మాత్రమే. ఇవి కాకుండా ఇతర రూట్లలో తిరుగుతున్నవాటిలో కూడా విశాఖకు చెందిన కోచ్‌లు ఉన్నాయి.)

(గమనిక 2: పూరీ స్టేషన్‌ నుంచి తిరుగుతున్న పూరీ – హౌరా, పూరీ – అహ్మదాబాద్‌ రైళ్లలో విశాఖకు చెందిన కోచ్‌లున్నట్లు రైల్వే నిపుణులు చెప్పారు.

ఎల్‌హెచ్‌బీ ఎందుకంటే..

* లింక్‌ హాఫ్‌మన్‌ బుష్చ్‌ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లు ప్రత్యేకమైనవి.

* ట్రాక్‌ నుంచి అదుపు తప్పే ప్రమాదం ఉండదు.

* పాత మోడల్‌ రైళ్లలో ఒక కోచ్‌కు, మరొక కోచ్‌కు మధ్య ఉన్న లింక్‌ బలీయంగా లేకపోవడంవల్ల పట్టాలు తప్పిన సమయాల్లో ప్రమాద తీవ్రత పెరిగి భారీగా ప్రాణనష్టం ఉండేది.

* ఎల్‌హెచ్‌బీ రైళ్లలో అధునాతనమైన లింక్‌ను ప్రవేశపెట్టారు. ఒక బోగీ పట్టాలు తప్పినా.. దాని వెనక ఉన్న మిగిలినవి ప్రమాద తీవ్రతను గణనీయంగా అదుపు చేస్తాయి. ముందున్న బోగీ పడకుండా చూడటం దీని ప్రత్యేకత. అన్ని కోచ్‌లూ ఇదే తరహాలో లింక్‌ చేసి ఉంటాయి.

* కోచ్‌ల పొడవు కూడా ఎక్కువ.

* సీట్ల సామర్థ్యం కూడా పెరిగింది.

 

ఒకే ఒక్క సాకు..

‘విశాఖవారికి ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల్ని నిర్వహించడం చేతకాదు’.. అని చెప్పి మన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లన్నింటినీ ఖుర్దారోడ్‌కు తరలించేశారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం గత రెండేళ్లలో 30కి పైగా మనకు కేటాయించగా.. ఇందులో స్లీపర్‌, ఫస్ట్‌ఏసీ, సెకండ్‌ ఏసీ ఉన్నాయి. వీటిని ఒక్కొక్కటిగా ఇతర డివిజన్లకు పంపేశారు. ఇదంతా కూడా కేవలం మౌఖిక ఆదేశాల ఆధారంగానే చేస్తున్నారు. ఎక్కడా లెక్కాపత్రం లేదు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల నిర్వహణలో వాల్తేరు డివిజన్‌ను బలోపేతం చేయాల్సిన తూర్పుకోస్తా అధికారులు ఆ పని మాత్రం చేయడం లేదు.

6వ పిట్‌లైన్‌ అంతేనా..

రైళ్లను నిర్వహించాలంటే పిట్‌లైన్లు చాలా ప్రధానం. విశాఖ కోచింగ్‌కేర్‌ సెంటర్‌లో ఇప్పటికి 5 పిట్‌లైన్లు మాత్రమే ఉన్నాయి. అంటే.. ఒకేసారి 5 రైళ్లను మాత్రమే నిర్వహించే సామర్థ్యం ఉంది. 6వ పిట్‌లైన్‌ నిర్మాణం గతేడాది మొదలుపెట్టినా ఇప్పటికీ పూర్తవ్వలేదు. కొత్త కోచ్‌లు, కొత్తరైళ్లు విశాఖకు ఇవ్వకపోవడానికి ఈ పిట్‌లైన్‌ పెండింగ్‌పనులు కూడా ఒక కారణంగా చూపిస్తున్నారు. మరో 3నెలల్లో ఇది పూర్తవుతుందని రైల్వే అధికారులు సమాధానమిస్తున్నా.. పనులు ఆ రకంగా లేవనేది స్పష్టమవుతోంది. ఇక్కడ స్థలం అందుబాటులో ఉన్నదాన్నిబట్టి మరో రెండు పిట్‌లైన్‌ నిర్మాణాలు కూడా చేస్తే వీలైనన్ని కొత్త రైళ్లు విశాఖకు మంజూరు అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇలా మనకెందుకు ఉండదు..?

ఇది సంత్రగచ్చి – చెన్నై మధ్య తిరుగుతున్న వారపు రైలు (22807/08). ఇది విశాఖకు వచ్చినప్పుడు ‘ఈనాడు’ పరిశీలించగా మొత్తం 17 కోచ్‌లన్నీ ఎల్‌హెచ్‌బీవే. సంత్రగచ్చి (ఎస్‌ఆర్‌సీ)కి చెందినవే ఉన్నాయి. దీనితో పోలిస్తే విశాఖకు చెందిన ఏ రైలులో కూడా ఇలా పూర్తిగా వాల్తేరు డివిజన్‌కు కోచ్‌లు కనిపించవు. ఒక్కో కోచ్‌ ఒక్కోచోట నుంచి వచ్చినవే.
రికార్డుల్లో ఉండవు..

ఇలా భువనేశ్వర్‌కు, పూరీకి తరలించిన ఏ కొత్త కోచ్‌లను కూడా పలానా చోటికి తరలించాం అనే రికార్డులు కూడా వాల్తేరు డివిజన్‌ అధికారుల దగ్గర లేకపోవడం విచిత్రంగా కనిపిస్తోంది. కోచ్‌ ఫ్యాక్టరీల్లో తయారైన ప్రతీ కొత్త కోచ్‌కు ఒక కోడ్‌నెంబరు ఇస్తారు. రైల్వేలో దానిమీదే రికార్డులు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం తమకు కేటాయించిన కోచ్‌లు ఎక్కడున్నాయో కూడా ఇప్పటివరకు తేల్చుకోలేని స్థితిలో వాల్తేరు డివిజన్‌ అధికారులున్నారు. విశాఖకు కేటాయించిన 17 సిరీస్‌, 18 సిరీస్‌ కోచ్‌లన్నీ భువనేశ్వర్‌కు తరలించినట్లుగా చెబుతున్నారు. వాటి స్థానంలో ‘దయ’గా ఇచ్చిన పాత కోచ్‌ల్నే వాల్తేరు అధికారులు ఇక్కడి రైళ్లకు వినియోగిస్తున్నారు. తూర్పుకోస్తా రైల్వే అధికారులు పంపినవే తాము సర్దుకుని వినియోగించుకుంటున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు.

ప్రతిపాదనలు ఉన్నా..

వాల్తేరు డివిజన్‌కు ఎల్‌హెచ్‌బీలు రాలేదని అధికారులు ప్రచారం చేస్తున్నారు. అలాంటి కోచ్‌లు గత రెండేళ్లుగా వస్తున్నా కూడా వాటిని భువనేశ్వర్‌కు రప్పించుకుంటూ తూర్పు కోస్తా అధికారులు మన ప్రయాణికుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ ఉంది. ఇప్పటికే దూరప్రాంత రైళ్లయిన సమతా ఎక్స్‌ప్రెస్‌, స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌ను ఎల్‌హెచ్‌బీలుగా మార్చాలన్న ప్రతిపాదన ఉంది. మరిన్ని రైళ్లనూ ఇలా మారుస్తారనీ అన్నారు. కానీ వచ్చిన కోచ్‌లనే సాగనంపుతుండటంతో ఏ రైలూ ఎల్‌హెచ్‌బీగా ఉన్నతీకరణ చెందలేదనే చెప్పాలి.