జాతీయం

వివాదాస్పదమైన రెడ్ లేబుల్ టీ యాడ్… హిందూస్థాన్‌ యూనీలివర్‌ పై ఆగ్రహం!

  • కుంభమేళాలో వృద్ధులను వదిలించుకునే ఎంతో మంది
  • అదే కాన్సెప్ట్ తో తయారైన యాడ్
  • హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటున్న నెటిజన్లు

ప్రముఖ ఎఫ్ఎంసీజీ బ్రాండ్ హిందుస్థాన్ యూనీలీవర్, తన రెడ్ లేబుల్ తేయాకు పౌడర్ కోసం చేసిన యాడ్, ఇప్పుడు విమర్శల పాలైంది. ఇది భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నెటిజన్లు ఆరోపిస్తూ, ఆ కంపెనీ ఉత్పత్తులు వాడటాన్ని ఆపివేయాలని ప్రచారం ప్రారంభించారు. కుంభమేళా జరుగుతున్న వేళ, వయసుమళ్లిన వృద్ధులను అక్కడకు తీసుకు వచ్చి వదిలించుకునేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తుంటారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, అదే యాంగిల్ లో ఈ యాడ్ ఉండటమే ఇప్పుడు దుమారం రేపుతోంది. ఈ ప్రకటనలో ఓ తండ్రి తాను తప్పిపోకుండా ఉండేందుకు కుమారుని చేయి పట్టుకుని నడుస్తూ ఉంటే, ఆ కుమారుడు ఉద్దేశపూర్వకంగానే తండ్రిని విడిచి వెళ్లిపోతాడు. ఆందోళనలో తండ్రి కేకలు పెడుతున్నా, పట్టించుకోకుండా తన మానాన తాను ముందుకు నడుస్తాడు. ఇదే సమయంలో జన సమూహంలో తన కుమారుడు తప్పిపోకుండా ఉండటానికి, తన చేతిని కొడుకు చేతిని కట్టేస్తున్న మరో తండ్రి అతనికి కనిపించడంతో మార్పు వచ్చి, తండ్రిని వెతుక్కుంటూ వచ్చి, కలుసుకుని ఇద్దరు కూర్చుని టీ తాగుతారు. ఈ యాడ్‌పై నెటిజన్లు ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.