క్రీడలు

విరాట్‌ కోహ్లీ స్లో పాయిజన్‌ లాంటోడు

ముంబయి: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ స్లో పాయిజన్‌ లాంటోడని భారత జట్టు మాజీ మానసిక వైద్యుడు ప్యాడీ అప్టన్‌ అన్నారు. 2011 ప్రపంచకప్‌ సమయంలో భారత జట్టుకు మానసిక శిక్షకుడిగా సేవలు అందించిన ఆయన ఆ సమయంలో కోహ్లీని అత్యంత దగ్గర నుంచి చూశారు. ఓ మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లీ ఏ ఫార్మాట్‌లోనైనా బ్యాటింగ్‌కు దిగేముందు తాను ఏం చెయ్యాలనుకుంటాడో అది ముందే నిర్ణయించుకుంటాడని చెప్పారు. అలాంటి ఆటతీరే తనకి దొరుకుతుందని, దాన్ని మ్యాచ్‌ అంతటికీ కొనసాగిస్తాడని అన్నారు.

‘అయితే ధోనీ అందుకు పూర్తి విరుద్ధం. అతను కొన్నిసార్లు వెనకబడినా చివరి నిమిషంలో ఎదురు తిరుగుతాడు. కానీ కోహ్లీ స్లో పాయిజన్‌ లాంటోడు. తనకి ఎన్ని పరుగులు అవసరమో అన్నే ప్రయత్నిస్తాడు. ఒకవేళ ఓవర్‌కి ఏడు పరుగులు అవసరమైతే, అలా ఏడు పరుగులు తగ్గకుండా, పెరగకుండా ఆడతాడు. ప్రత్యర్థలకు అవకాశమే ఇవ్వడు’ అని అప్టన్‌ పేర్కొన్నారు.

కాగా ఐపీఎల్‌లో విఫలమైనా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ దాన్నుంచి బయటపడి ప్రపంచకప్‌పై దృష్టిసారించాడు. మే 30 నుంచి ఇంగ్లండ్‌లో ప్రారంభమయ్యే మెగా ఈవెంట్‌లో జూన్‌ 5న సౌథాంప్టన్‌లో భారత్‌ దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌ ఆడనుంది.