తెలంగాణ

విమానంలో బెయిర్‌స్టో పిల్ల చేష్టలు

హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో పిల్లచేష్టల వీడియో ఒకటి ఇప్పుడు నెటిజన్లకు తెగ నవ్వులు తెప్పిస్తోంది. సన్‌రైజర్స్‌ యాజమాన్యం తమ సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోని పోస్టు చేయడంతో అభిమానులకు తెగ నచ్చేసింది. ఐపీఎల్‌లాంటి బిజీ షెడ్యూల్‌లో ఆటగాళ్లు ఎక్కువగా విమానాల్లో ప్రయాణం చెయ్యాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో ఎంత సరదాగా గడుపుతారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఆటగాళ్లు ఖాళీ సమయాల్లో ఇతరులను ఆటపట్టించే వీడియోలు గతంలో పలుసార్లు మనం చూసే ఉంటాం. అలాంటి సరదానే ఇప్పుడు బెయిర్‌స్టో చేశాడు.

కింగ్స్‌ XI పంజాబ్‌తో సోమవారం జరిగే మ్యాచ్‌ ఆడేందుకు సన్‌రైజర్స్‌ జట్టు హైదరాబాద్‌ నుంచి మొహాలీ వెళ్తుండగా సన్‌రైజర్స్‌ డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ జానీ బెయిర్‌స్టో విమానంలో పిల్ల చేష్టలు చేసి సిబ్బందిని, సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్‌సన్‌ను సరదాగా ఆటపట్టించాడు. సీట్ల వెనుక దాక్కొని.. అతడి వద్దకు వచ్చే వారిపైకి లేచి అరుస్తూ భయపెట్టాడు. ఇలా చేయడంతో పక్కనున్న జట్టు ఆటగాళ్లు తెగ నవ్వుకున్నారు. ఈ వీడియోను సన్‌రైజర్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో అభిమానులు తెగ లైక్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గత మ్యాచ్‌లో ముంబయి చేతిలో ఓటమిచవిచూసిన సంగతి తెలిసిందే. 136 పరుగుల లక్ష్యఛేదనలో 96 పరుగులకే కుప్పకూలి ఘోర ఓటమి పాలైంది. దీంతో సోమవారం జరగబోయే మ్యాచ్‌లో పంజాబ్‌పై ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది.