తెలంగాణ

విద్యార్థుల జీవితాలతో విపక్షాల చెలగాటం:కేటీఆర్‌

హైదరాబాద్‌: గ్లోబరీనా సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మరోసారి స్పష్టంచేశారు. ఇంటర్‌ విద్యార్థుల జీవితాలతో విపక్షాల చెలగాటమాడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రం పచ్చగా ఉంటే విపక్షాల కళ్లు ఎర్రబడుతున్నాయన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మే డే వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన గందరగోళం తనను కూడా కలచివేసిందని కేటీఆర్‌ అన్నారు. ఇంటర్ విద్యార్థులెవరూ తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు. ఐటీ శాఖకు, ఇంటర్మీడియట్‌ బోర్డుకు సంబంధం ఉండదని తెలిపారు. ఇంటర్‌ ఫలితాల విషయంలో విపక్షాలు చిల్లర రాజకీయం చేస్తున్నాయన్నారు. రూ.4 కోట్ల టెండర్‌కు రూ.10వేల కోట్లు ఎవరైనా లంచం ఇస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలను అవసరమైతే కోర్టుకు లాగుతామన్నారు. ఇంటర్‌ ఫలితాల్లో పొరపాట్లకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.