అంతర్జాతీయం

వికీలీక్స్‌ సహ వ్యవస్థాపకుడు అసాంజే అరెస్టు

లండన్‌: వికీలీక్స్‌ సహవ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజేను లండన్‌లోని ఈక్వెడార్‌ దౌత్యకార్యాలయం వద్ద అరెస్టు చేశారు. ఒక లైంగిక వేధింపుల కేసులో స్వీడన్‌ పోలీసులు అరెస్టు చేయకుండా అసాంజే ఏడేళ్ల క్రితం ఈ దౌత్యకార్యాలయంలో ఆశ్రయం పొందారు. కానీ ఆయన పలు మార్లు అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘిస్తుండటంతో తాము ఇచ్చిన ఆశ్రయాన్ని ఉపసంహరించుకొంటున్నట్లు దౌత్యకార్యాలయ ప్రతినిధి లెనిన్‌ మొరినో వెల్లడించారు. దీంతో దౌత్యకార్యాలయం నుంచి వెళ్లడానికి అసాంజే అంగీకరించలేదు. తనను వికీలీక్స్‌ కార్యకలాపాలపై ప్రశ్నించేందుకు అమెరికాకు అప్పజెపుతారని వారికి చెప్పినట్లు తెలిసింది.
ఇది అన్యాయం..
దీనిపై వికీలీక్స్‌ స్పందిస్తూ ఈక్వెడార్‌ అన్యాయంగా అసాంజే రాజకీయ ఆశ్రయాన్ని ఉపసంహరించుకొందని పేర్కొంది. ఈ ఘటన జరిగిన కొన్ని నిమిషాల్లోనే బ్రిటన్‌ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారని పేర్కొంది. దీనిపై బ్రిటన్‌ పోలీసులు స్పందిస్తూ కోర్టులో లొంగిపోకపోవడంతో అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈక్వెడార్‌ దౌత్యవేత్త పిలవడంతోనే అక్కడకు వెళ్లినట్టు తెలిపారు.  అసాంజేను సెంట్రల్‌ లండన్‌లోని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆయన్ను వెస్ట్‌మినిస్టర్‌ న్యాయస్థానంలో ప్రవేశపెట్టేవరకు అక్కడే ఉంచనున్నారు.
చట్టానికి ఎవరూ అతీతులు కారు..
అసాంజే అరెస్టుపై హోం సెక్రటరీ సాజిద్‌ జావెద్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘‘జులియన్‌ అసాంజే ఇప్పుడు పోలీస్‌ కస్టడీలో ఉన్నారు. ఆయన యూకేలో న్యాయవిచారణ ఎదుర్కోనున్నారు. మాకు సహకరించినందుకు ఈక్వెడార్‌కు కృతజ్ఞతలు. వృత్తిలో నిబద్ధతతో వ్యవహరించిన మెట్రోపోలీసులకు అభినందనలు. చట్టానికి ఎవరూ అతీతులు కారు.’’ అని పేర్కొన్నారు.