జాతీయం

‘వార్‌’నాయనో అనిపిస్తున్నాం : ట్రంప్‌

ట్రేడ్‌వార్‌ దెబ్బకు చైనా వాణిజ్యం కుదేలైపోతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. ఏదో రకంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆ దేశం తహతహలాడుతోందని వ్యాఖ్యానించారు. తాజాగా ట్రంప్‌ వ్యాఖ్యలతో వాణిజ్య యుద్ధం మరింత ముదిరే పరిస్థితి నెలకొంది. ‘‘మనం బిలియన్ల కొద్దీ డాలర్లను వసూలు చేస్తున్నాం. దీంతో కంపెనీలు చైనాను వదిలి ఇక్కడకు వచ్చేస్తున్నాయి. వారు ఆ స్థాయిలో టారీఫ్‌లను చెల్లించాలనుకోవడంలేదు. ఈ కారణంగా వారు ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. దీంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి చైనా తహతహలాడిపోతోందని చెప్పగలను. వారు టారీఫ్‌ల దెబ్బకు ఇబ్బంది పడుతున్నారు.. ఎందుకంటే కంపెనీలు టారీఫ్‌లు చెల్లించాలనుకోవడంలేదు. అందుకే చైనాను వీడుతున్నారు. చైనా వారి కంపెనీలకు రాయితీలు ఇస్తోంది. అందుకే మనవారు అంత మొత్తంలో చెల్లించాల్సిన అవసరం రావడంలేదు. మాకు చైనాతో డీల్‌ కుదిరింది. కానీ వారు దానిపై వెనక్కి తగ్గి నాలుగు అభ్యంతరాలున్నాయి.. ఐదు అభ్యంతరాలు ఉన్నాయి అన్నారు.. సరే అని మేము దానిని మార్చాము.. ఇప్పుడు చైనాతో మరో రకంగా డీల్‌ చేస్తున్నాం. వారు పాత డీల్‌కు అంగీకరించేవరకు.. నాకు ఎలాంటి ఆసక్తి లేదు.’’ అని ట్రంప్‌ శ్వేతసౌధంలో పేర్కొన్నారు.
మాజీ ఉపాధ్యక్షుడు జో బైడన్‌ చైనాతో బాగా డీల్‌ చేయలేకపోయారని విమర్శించారు. ఆయన డమ్మీగా మిగిలిపోయారన్నారు. చైనా తమకు పోటీకాదని ఆయన భావించినట్లున్నారని ట్రంప్‌ పేర్కొన్నారు. అతికొద్ది కాలంలోనే చైనా 500 బిలియన్‌ డాలర్ల ఆదాయం పొందిందన్నారు. తమకు చైనా ప్రధాన పోటీదారు అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇప్పుడు ఆ దేశం ఒక వాణిజ్య ఒప్పందం కోసం తహతహలాడుతోందని చెప్పారు.