జాతీయం

వారుంటే కాంగ్రెస్‌లో ఎప్పుడో చేరేవాణ్ని

పట్నా: ఇందిరాగాంధీ బతికి ఉంటే తాను ఎప్పుడో కాంగ్రెస్‌లో చేరేవాడినని ఇటీవల ఆ పార్టీలో చేరిన ప్రముఖ నేత శతృఘ్న సిన్హా అభిప్రాయపడ్డారు. భాజపాలో ఉన్నప్పటికీ తానెప్పుడూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. పార్టీలో చేరిన తరవాత తొలిసారి పట్నాలో పర్యటించిన ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ‘‘రాహుల్‌ గాంధీ ప్రాబల్యం పెరుగుతూ వస్తోంది. దేశ భవిష్యత్తు ఆయన చేతిలోనే ఉందని భావిస్తున్నాను. రాహుల్‌ పార్టీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఓ గొప్ప విజయం’’ అని శతృఘ్న అభిప్రాయపడ్డారు.

రాజకీయ జీవితం ప్రారంభించిన పార్టీ నుంచి వైదొలగడం ఇష్టం లేకే ఇన్ని రోజులు భాజపాలో కొనసాగానని శతృఘ్న తెలిపారు. కానీ గత మూడేళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని.. పార్టీలో ఒకే వ్యక్తి నిర్ణయాలు చెల్లుబాటవుతున్నాయని ఆరోపించారు. రాహుల్‌ నాయకత్వంలో దేశానికి పునర్‌వైభవం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భాజపా నాయకుల వలే రాహుల్‌ మోసపూరిత హామీలు ఇవ్వరన్నారు. రైతులు, యువత సమస్యల్ని అర్థం చేసకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ఈసారి ఎన్నికల్లో శతృఘ్న సిన్హా.. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పట్నా సాహిబ్‌ నుంచి తిరిగి బరిలోకి దిగారు. తనకు పోటీగా భాజపా తరఫున కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పోటీ చేస్తున్నారు.