జాతీయం

వారణాసిలో ఓట్లను చీల్చాలని కుట్ర: మాయావతి

లఖ్‌నవూ (ఉత్తర్‌ప్రదేశ్‌): వారణాసిలో ఓట్లను చీల్చడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పోటీ చేస్తానని భీమ్ ఆర్మీ చీఫ్‌ చంద్ర శేఖర్‌‌ ఆజాద్ ప్రకటించారు. ఈ విషయంపై మాయావతి స్పందిస్తూ… ‌‘దళితుల ఓట్లను చీల్చి, ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతోనే భాజపా రాజకీయాలు చేస్తోంది. భాజపా కుట్రలో భాగంగానే భీమ్‌ ఆర్మీ ఏర్పాటైంది. ఇప్పుడు కిందిస్థాయి రాజకీయాలు చేస్తోంది. మొదట కుట్రపూరితంగా భీమ్‌ ఆర్మీ చీఫ్‌ను బీఎస్పీలో చేరేలా చేయాలని, ఇందులో తమ వ్యక్తిగా ఆయనను వినియోగించుకోవాలని భాజపా చాలా ప్రయత్నించింది. కానీ, ఆ కుట్ర విఫలమైంది. దళితులు, మైనార్టీలు, ఓబీసీలకు వ్యతిరేకంగా ఆ పార్టీ పనిచేస్తోంది. ఇటువంటి వారికి ఓటు వేసి, ప్రజలు తమ ఓటు హక్కును వృథా చేసుకోవద్దని నేను కోరుతున్నాను’ అని వ్యాఖ్యానించారు.

‘అహంకారపూరితమైన భాజపాను అధికారం నుంచి తొలగించేందుకు దళితుల ప్రతి ఓటు చాలా ముఖ్యమని మాయావతి అన్నారు. వారి ఓట్లు వృథా కానివ్వద్దని, భవిష్యత్తుని నరకం చేసుకోవద్దని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, ప్రధాని మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు పోటీగా దళిత నేత చంద్ర శేఖర్‌‌ ఆజాద్ పోటీకి దిగడంతో ఆ స్థానంలో బీఎస్పీ, ఎస్పీ ఓట్లు చీలే అవకాశం ఉందని ఆ పార్టీలు భావిస్తున్నాయి.