జాతీయం

వామ్మో.. రూ.930 పెరిగిన పసిడి ధర

దేశీయ మార్కెట్లో పసిడి ధర ఆకాశన్నంటింది. బంగారం దిగుమతులపై కస్టమ్స్‌ సుంకాన్ని పెంచడంతో ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధర ఆ తర్వాత కాస్త తగ్గినట్లే కన్పించినా.. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో నేడు అమాంతం ఎగబాకింది. గురువారం ఒక్క రోజే రూ. 930 పెరగడంతో 10 గ్రాముల పుత్తడి ధర రూ. 35,800కు చేరింది. అటు వెండి కూడా నేడు బంగారం దారిలో పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో రూ. 300 పెరిగింది. దీంతో బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 39,200 పలికింది.

త్వరలో వడ్డీరేట్లు తగ్గొచ్చిన యూఎస్‌  ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పోవెల్‌ సంకేతాలిచ్చారు. దీంతో బంగారంలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమని మదుపర్లు భావించినట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో ఈ లోహాలకు డిమాండ్‌ పెరిగిందని అన్నారు. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 1,420.80 డాలర్లు, ఔన్సు వెండి ధర 15.24 డాలర్లుగా ఉంది.