అంతర్జాతీయం

వాట్సాప్‌ ద్వారా వైరస్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ వైరస్‌ బారిన పడిందట.  వాట్సాప్‌ కమ్యూనికేషన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఓ స్పై వేర్‌ కొన్ని మొబైల్‌ ఫోన్లలోకి ప్రవేశించిందని కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ స్పైవేర్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ అనే అడ్వాన్స్‌డ్‌ సైబర్‌ యాక్టర్‌ రూపొందించినట్లు తెలిసింది. వాట్సాప్‌ భద్రతా వ్యవస్థలో తలెత్తిన లోపం కారణంగా ఈ స్పై వేర్‌ వచ్చిందని, ఈ లోపాన్ని ప్రస్తుతం సరిచేసినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. యూజర్లు తమ వాట్సాప్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని కోరారు.

వాట్సాప్‌ వాయిస్‌ కాలింగ్‌ ద్వారా వచ్చే మిస్డ్‌ కాల్స్‌తో ఈ మాల్వేర్‌ ఫోన్లలోకి ప్రవేశించినట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. మే మొదటివారంలో ఈ మాల్‌వేర్‌ను గుర్తించినట్లు తెలిపారు.  ‘వాయిస్‌ కాలింగ్స్‌కు అదనపు భద్రతా ఫీచర్లను పెడుతుండగా మా టీం ఈ లోపాన్ని గుర్తించింది. వాట్సాప్‌లోని ఈ లోపాన్ని అదనుగా చేసుకుని స్సైవేర్‌ యూజర్లపై దాడి చేసింది. యూజర్లకు గుర్తు తెలియని నంబరు నుంచి ఒకటి లేదా రెండు వాట్సాప్‌ వాయిస్‌ కాల్స్‌ వచ్చి ఉంటాయి. కాల్‌ చేసే సమయంలోనే మాల్వేర్‌ కోడ్‌ ఫోన్లోకి ప్రవేశించింది. అయితే ఈ స్పైవేర్‌ బారిన పడ్డ యూజర్ల సంఖ్యను మాత్రం స్పష్టంగా చెప్పలేం’ అని వాట్సాప్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. జరిగిన దానికి తాము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని, వాట్సాప్‌ యూజర్లు వెంటనే తమ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని కంపెనీ కోరింది.

ఇజ్రాయెల్‌ కంపెనీ తయారు చేసిన ఈ శక్తిమంతమైన స్పైవేర్‌ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్‌ చేస్తుంది. ఫోన్ల కెమెరాలను నియంత్రించి వాటిని నిఘా పరికరాలుగా మార్చేయగలదట. జర్నలిస్టులు, లాయర్లు, మానవహక్కుల కార్యకర్తల ఫోన్లను హ్యాక్‌ చేసేందుకు ఈ స్పైవేర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇస్తాంబుల్‌ హత్యకు గురైన సౌదీ జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ ఉదంతంలోనూ ఈ స్పైవేర్‌ పాత్ర ఉన్నట్లు సమాచారం. ఖషోగ్గీ అత్యంత సన్నిహితుడు కూడా ఈ స్పైవేర్‌ బారిన పడినట్లు తెలుస్తోంది.