జాతీయం

వయనాడ్‌లో రాహుల్‌ విజయం

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తొలిసారిగా దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో రాహుల్‌ విజయం సాధించారు. మరోవైపు కాంగ్రెస్‌ కంచుకోట అయిన యూపీలోని అమేఠీలో మాత్రం రాహుల్‌ ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. ఇక్కడ భాజపా నేత స్మృతి ఇరానీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

వయనాడ్‌ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌ ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తోంది. దీంతో దక్షిణాది నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన రాహుల్‌.. వయనాడ్‌ను ఎంచుకున్నారు. అయితే ఇది రాహుల్‌ అమేఠీ గెలుపుపై ప్రభావం చూపించింది. దేశవ్యాప్తంగా ప్రచారాలు చేపట్టడంతో పాటు, వయనాడ్‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సి రావడంతో రాహుల్‌ అమేఠీ ప్రజలకు అందుబాటులో లేకపోయారు. దీంతో అక్కడి ఓటర్లు స్మృతి ఇరానీకి మొగ్గు చూపినట్లు కన్పిస్తోంది.