జాతీయం

వదంతులను నమ్మొద్దు: శ్రీలంక ప్రధాని

కొలోంబో: శ్రీలంకలోని మూడు చర్చిలు, మూడు హోటళ్లలో జరిగిన బాంబు పేలుళ్లపై ఆ దేశ ప్రధానమంత్రి రణిల్‌ విక్రమసింఘే స్పందిస్తూ ఈ సందర్భంగా వ్యాప్తి అవుతున్న వదంతులను నమ్మొద్దని పిలుపునిచ్చారు. ‘ఈ పిరికిపంద చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషాద సమయంలో ఐక్యంగా ఉండాలని శ్రీలంక ప్రజలకు ఓ పిలుపు ఇస్తున్నాను. నిర్ధరించుకోకుండా వస్తున్న ప్రచారాన్ని, వదంతులను దయచేసి పట్టించుకోకండి. ఈ పరిస్థితులను అధిగమించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలను తీసుకుంటోంది’ అని అన్నారు.

‘ఉగ్రదాడి’ని ఖండిస్తున్నాం: పాకిస్థాన్‌

శ్రీలంకలోని జరిగిన బాంబు పేలుళ్లపై పాకిస్థాన్‌ స్పందించింది. ‘ఉగ్రదాడి’ని ఖండిస్తున్నామంటూ పాక్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి మొహమ్మద్‌ ఫైజల్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. ‘శ్రీలంకలోని చర్చిలు, హోటళ్లలో జరిగిన బాంబు పేలుళ్లను పాక్‌ ఖండిస్తోంది. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంత మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషాద సమయంలో పాకిస్థాన్‌ ప్రజలు, ప్రభుత్వం… శ్రీలంకలోని ప్రజలు, ప్రభుత్వానికి మద్దతుగా నిలబడుతోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలుస్తున్నాం’ అని తెలిపారు. పాక్‌ మానవహక్కుల శాఖ మంత్రి షిరీన్‌ మజరీ ఈ పేలుళ్లపై స్పందిస్తూ… ‘ఈ హేయమైన ఉగ్రదాడిని మేం ఖండిస్తున్నాం. శ్రీలంకకు మద్దతుగా నిలుస్తాం. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి గట్టిగా చర్యలు తీసుకోవాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.