జాతీయం

వచ్చే నెలలో 17వ లోక్‌సభ తొలి సమావేశాలు!

దిల్లీ: పదిహేడో లోక్‌సభ తొలి సమావేశాలు వచ్చే నెలలో జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. జూన్‌ 6-15 మధ్య ఈ  సమావేశాలు జరిగే అవకాశమున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. మే 30న ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ మరుసటి రోజు అంటే 31న కొత్త కేబినెట్‌ భేటీ కానుంది. ఈ భేటీలో లోక్‌సభ సమావేశాల తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

సమావేశాల తొలి రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజున ప్రొటెం స్పీకర్‌ను కూడా నియమించనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయిస్తారు. జూన్‌ 10న లోక్‌సభకు కొత్త స్పీకర్‌ను ఎన్నుకోనున్నట్లు సమాచారం. 16వ లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన సుమిత్రా మహజన్‌ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో కొత్త స్పీకర్‌గా ఎవరిని ఎన్నుకుంటారనేది ఆసక్తిగా మారింది.