అంతర్జాతీయం

లైన్లో నిలబడి..బాంబు పేల్చి..

కొలంబో: ఈస్టర్ సండేనాడు జరిగిన భీకర ఘటనకు యావత్‌ శ్రీలంక ఉలిక్కిపడింది. బాంబు దాడి జరిగిన ప్రాంతాల్లో ఒకటైన సినామన్ హోటల్లో అప్పటి దాకా ఎవరి పనుల్లో వారు బిజీబిజీగా ఉన్నారు. హోటల్లో బస చేసేందుకు వచ్చేవారు వస్తుంటే వెళ్లే వాళ్లు వెళ్తున్నారు. ఉదయం 8:30గంటల సమయంలో అక్కడున్న వాళ్లందరూ బ్రేక్‌ ఫాస్ట్‌ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పండుగ రోజు కావడంతో అక్కడికి వచ్చేవారి తాకిడి కొంచెం ఎక్కువగానే ఉంది. దీంతో అల్పాహారం తినడం కోసం అందరూ పెద్ద క్యూ కట్టారు. అక్కడున్న హోటల్‌ మేనేజర్ వారందరినీ స్వాగతిస్తున్నాడు. అందరిలాగే మహమ్మద్‌ అజాం మహమ్మద్‌ అనే వ్యక్తి ఓపికగా క్యూలైన్లో నిలుచ్చున్నాడు. భుజాన ఓ బ్యాగ్‌ తగిలించుకుని చేతిలో ప్లేట్‌ పట్టుకుని నిలబడ్డాడు. తాను క్యూలైన్‌ మధ్యలోకి వచ్చానని నిర్ధారించుకుని ఒక్కసారిగా బాంబు పేల్చాడు. ఏం జరిగిందో?.. ఎటు నుంచి శబ్ధం వినిపించిందో తెలుసుకునేలోపు మహమ్మద్‌ అజాంతో సహా పదుల సంఖ్యలో నిర్జీవులుగా తేలారు. అప్పటి దాకా చిన్నపిల్లల అల్లరితో పండగవాతావరణం కనిపించిన ఆ హోటల్లో ఒక్క సారిగా బాధితుల ఆర్తనాదాలతో మార్మోగింది.

ఆ హోటల్‌ మేనేజర్‌ చెప్పిన వివరాల ప్రకారం మహమ్మద్‌ తాను శ్రీలంకకు చెందిన వ్యక్తిగా చెప్పి హోటల్‌లోకి ప్రవేశించాడు. తానో పెద్ద వ్యాపారినని, లగ్జరీ గదులు బుక్‌ చేసుకున్నాడు. బిజినెస్‌ పనిమీద కొలంబో వచ్చినట్లు తెలిపాడు. నిజానికి మహమ్మద్‌ ఇచ్చింది సరైన అడ్రస్‌ కాదని తర్వాత తేలింది. అదే హోటల్‌లో సినీ నటి రాధిక శరత్‌ కుమార్‌ బస చేశారు. ఘటన జరగడానికి కొంత సేపటికి ముందే ఆమె అక్కడి నుంచి బయటకు వచ్చేశారు.