క్రైమ్జాతీయం

రోహిత్‌ తివారీ హత్య: భార్య అపూర్వ అరెస్టు

దిల్లీ: ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్‌ హత్య కేసులో రోహిత్‌ భార్య అపూర్వ శుక్లాను దిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై మూడు రోజులుగా ఆమెను విచారిస్తున్న పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వైవాహిక జీవితంలో వచ్చిన గొడవల కారణంగానే ఆమె తన భర్త రోహిత్‌ను హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఆయన ఊపిరాడకపోవడంతోనే మృతి చెందినట్లు వైద్య నివేదికలో వెల్లడైన విషయం తెలిసిందే. దీంతో బయటి వ్యక్తులు ఎవరూ లోపలికి ప్రవేశించినట్లు ఆధారాలు లభించకపోవడంతో ఈ హత్య వెనక ఇంట్లోవారి హస్తముందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో అపూర్వను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.

ఈనెల 16న రోహిత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే శవపరీక్ష నివేదికలో రోహిత్‌ది సహజ మరణం కాదని తేలడంతో కేసును క్రైమ్ బ్రాంచ్‌కి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో రోహిత్‌ తల్లి ఉజ్వల స్పందిస్తూ రోహిత్‌, అపూర్వ దంపతుల మధ్య అంతగా సఖ్యత లేదని..పెళ్లైన మొదటిరోజు నుంచే వారి మధ్య విభేదాలు ఉన్నాయని ఆరోపించారు.