తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌, నిందితుడు మృతి

మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి ఠాణాకు చెందిన కానిస్టేబుల్‌ , నిందితుడు మృతి చెందారు. ఓ కేసు దర్యాప్తు నిమిత్తం బిహార్‌ వెళ్లిన ఎస్సై రవీందర్‌నాయక్‌, కానిస్టేబుల్‌ తులసీరామ్‌, మహిళా కానిస్టేబుల్‌ లలిత వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యప్రదేశ్‌లోని డిండోరి జిల్లా సమన్‌పూర్‌ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం చక్రం ఊడిపోయి ప్రమాదానికి గురయ్యారు.  తలకు బలమైన గాయమై కానిస్టేబుల్‌ తులసిరామ్‌, నిందితుడు రమేష్‌ నాయక్‌ ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ఎస్సై రవీందర్‌నాయక్‌, మహిళా కానిస్టేబుల్‌ లలితకు గాయాలయ్యాయి.
మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కాటేదాన్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు రమేష్‌ నాయక్‌ పరారీలో ఉన్నాడు. అతడ్ని పట్టుకునేందుకు మూడు రోజుల క్రితం ఎస్‌.ఐ రవీందర్‌ ఆధ్వర్యంలో పోలీసు బృందం బిహార్‌ వెళ్లిన క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. 2018 బ్యాచ్‌కి చెందిన తులసీరామ్‌ స్వస్థలం రంగారెడ్డి జిల్లా ధరూర్‌. కానిస్టేబుల్‌ మృతి పట్ల సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబాన్ని పోలీస్‌శాఖ పరంగా ఆదుకుంటామని తెలిపారు.