జాతీయం

రైలులో కుమార్తె మరణంపై తల్లిదండ్రుల ఆరోపణ

తిరువనంతపురం: అనారోగ్యంతో ఉన్న ఏడాది బాలికను రైలులో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గ మధ్యలోనే చనిపోయింది. దీంతో ఆ బాలిక మరణానికి కారణం రైల్వేవర్గాలని అని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటన కేరళలో జరిగింది. బాలిక ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రైలులో టీటీఈ తమకు రిజర్వేషన్‌ బెర్తు కేటాయించి ఉంటే తమ కుమార్తె చనిపోయి ఉండేది కాదని బాధితులు వాపోయారు.

మరియం అనే ఏడాది బాలిక పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యతో జన్మించింది. పూట గడవడానికి సైతం ఇబ్బంది పడే ఆమె తల్లిదండ్రులు మూడు నెలల క్రితమే తిరువనంతపురంలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో బాలికకు గుండె శస్త్ర చికిత్స చేయించారు. ఆరోగ్యం మెరుగైందనుకున్న తరుణంలో బాలికకు ఉన్నట్టుండి జ్వరం వచ్చి తీవ్రమైంది. తిరువనంతపురంలో మరియంకు శస్త్రచికిత్స చేసిన వైద్యుణ్ని సంప్రదించగా.. ఆస్పత్రికి తీసుకురావాలని డాక్టర్‌ సూచించారు. ప్రత్యేక ఆంబులెన్స్‌లో తీసుకెళ్లే స్తోమత లేకపోవడంతో బాలిక తల్లిదండ్రులు షమీర్‌, సుమయా తిరువనంతపురం వెళ్లేందుకు మవేలీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కారు. తమ కుమార్తె అనారోగ్య పరిస్థితి దృష్ట్యా జనరల్‌ బోగీలో వెళ్లడం కష్టమని.. తమకు ఒక బెర్తు కేటాయించాలని షమీర్‌ టీటీఈని అభ్యర్థించాడు. సీట్లు ఖాళీ లేకపోవడంతో ఉండడంతో టీటీఈ జనరల్‌ బోగీలోనే వెళ్లాలని సూచించాడు.

‘‘మేం ఎంత అభ్యర్థించినా టీటీఈ మాకు బెర్తు కేటాయించలేదు. చేసేది లేక నా భార్యను, పాపను మహిళల కంపార్ట్‌మెంట్‌లో ఎక్కించి నేను జనరల్‌ బోగీలో ఎక్కాను. ఈ బోగీల్లో రద్దీ ఎక్కువగా ఉంది.’’ అని షమీర్‌ వెల్లడించాడు.

రైలు కుట్టిపురానికి రాగానే మరియంకు వాంతులు కావడంతో దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక చనిపోయింది. దీంతో తమ కుమార్తె మరణానికి రైల్వే అధికారులే కారణమని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాలికకు పోస్ట్‌మార్టం నిర్వహించి సొంత గ్రామానికి తరలించారు.