తెలంగాణ

రేపే కౌంటింగ్

స్నేహ, హైదరాబాద్ : ప్రజాతీర్పు మరో రోజులో స్పష్టంకానుంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉదయం ఏడు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 119 నియోజకవర్గాల్లో ఆధిక్యత సరళి ఎటువైపుందో మధ్యాహ్నంకల్లా స్పష్టమవుతుంది. ఆ తర్వాత పూర్తిస్థాయి ఫలితాలను ప్రకటిస్తారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల ఏడోతేదీన ఎన్నికలు ముగిసిన శాసనసభ నియోజకవర్గాల్లోని పోలింగు కేంద్రాల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను (ఈవీఎంలను) ఇప్పటికే సంబంధిత కౌంటింగ్ కేంద్రాలకు తరలించిన సంగతి తెలిసిందే. ఈవీఎంలన్నింటిని స్ట్రాంగ్‌రూంలకు తరలించి గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. మూడంచెల పటిష్ఠ భద్రతతో కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించారు. కేంద్ర బలగాల ప్లాటూన్ మొదటి స్థాయిలో పర్యవేక్షిస్తుంది. రెండు, మూడుచోట్ల రాష్ట్ర పోలీసు బలగాలను మోహరించారు. వీటికి వంద మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధించారు. స్ట్రాంగ్‌రూంల వద్ద నిరంతర నిఘా కొనసాగుతున్నది. అనుమతి లేకుండా ఎవరూ ఆ పరిధిలోకి వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం డేగ కండ్లతో కాపలా కాస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు.శాసనసభ నియోజకవర్గాల్లోని ఓట్లను లెక్కించడానికి ఎన్నికల కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా 43 కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఇందులో హైదరాబాద్ జిల్లాలో 13 నెలకొల్పగా, మిగతా 30 జిల్లాల్లో ఒక్కోటి చొప్పున ఉంటాయి. ఈ కేంద్రాల్లో ఆయా జిల్లాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.