ఆంధ్రప్రదేశ్

రెవెన్యూ సిబ్బందిపై కర్రలతో దాడి

శ్రీకాకుళం: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపై దాడి జరిగింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం గ్రామీణ మండలం నైరలో చోటుచేసుకుంది. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో రెవెన్యూ యంత్రాంగం మంగళవారం రాత్రి నైర బీసీకాలనీకి చేరుకుంది. లారీల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తుండడంతో రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. దీంతో నైర గ్రామస్థులు వారిపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో వీఆర్వోలు చంద్రశేఖర్‌, విశ్వేశ్వరరావుకు గాయాలయ్యాయి. మిగతా వీఆర్వోలు చంద్రభూషణ రావు, అప్పలనాయుడు, వీఆర్‌ఏ శ్రీరాములు దాడి నుంచి తప్పించుకున్నారు. బాధితులను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అనంతరం శ్రీకాకుళం గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో బాధిత అధికారులు ఫిర్యాదు చేశారు.