జాతీయం

రెండో దశ పోలింగ్‌ ప్రారంభం

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరాంగణంలో మరో అంకానికి తెరలేచింది. దేశంలోని 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో రెండో దశ పోలింగ్‌ ఇవాళ ప్రారంభమైంది. ఉదయం  7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే ముగియనుంది.
రెండో దశలో మొత్తం 1,611 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వాస్తవానికి రెండో దశలో భాగంగా 97 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగాల్సి ఉంది. తమిళనాడులోని వేలూరు నియోజకవర్గం ఎన్నిక రద్దవడం, త్రిపురలోని త్రిపుర-తూర్పు లోక్‌సభ స్థానం ఎన్నిక మూడో దశకు (ఏప్రిల్‌-23కు) వాయిదా పడడంతో రెండు స్థానాలు తగ్గాయి.
కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తర్‌ప్రదేశ్‌లో 8, అసోం, బిహార్‌, ఒడిశాల్లో 5 సీట్ల చొప్పున, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌లలో 3 సీట్ల చొప్పున, జమ్మూకశ్మీర్‌లో 2 సీట్లు, మణిపూర్‌, పుదుచ్చేరిల్లో ఒక్కో లోక్‌సభ సీటుకు పోలింగ్‌ జరగనుంది.

ఒడిశాలో 35 శాసనసభ స్థానాలకు, తమిళనాడులో ఖాళీగా ఉన్నవాటిలో 18 శాసనసభ స్థానాలకూ, పుదుచ్చేరిలో ఒక శాసనసభ స్థానానికి కూడా ఇవాళే పోలింగ్‌ జరుగుతోంది. కేంద్ర మంత్రులు జితేంద్రసింగ్‌, జ్యుయల్‌ ఓరం, సదానందగౌడ, పొన్‌ రాధాకృష్ణన్‌, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, డీఎంకే నేతలు దయానిధి మారన్‌, ఎ.రాజా, కనిమొళి తదితరులు రెండో దశలో బరిలో నిలిచిన ప్రముఖుల్లో ఉన్నారు.