క్రీడలు

రెండు జట్ల మధ్య పవర్‌ప్లేనే తేడా : అశ్విన్‌

మొహాలి : ఐపీఎల్‌ 12వ సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు కథ దాదాపు ముగిసినట్లే. మొహాలి వేదికగా కోల్‌కతా నౌట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో వరుసగా నాలుగో ఓటమిని తన ఖాతాలో వేసుకున్న పంజాబ్‌ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది. ప్లేఆఫ్స్‌కు ముందు ఇంకో మ్యాచ్‌ ఉన్నప్పటికీ ఆ మ్యాచ్‌ తర్వాత పంజాబ్‌ ముందుకు వెళ్లే అవకాశాలు తక్కువే. ఓటమిపై ఆ జట్టు కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మాట్లాడాడు. ‘మేం నిర్దేశించింది పెద్ద లక్ష్యమే. దాదాపు ఇంతే లక్ష్యాన్ని గతంలో కాపాడుకోగలిగాం. అయితే రెండో అర్ధభాగంలో మంచు కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం మాకు తెలుసు. అది ప్రత్యర్థి జట్టుకు కలిసొచ్చింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ కూడా బాగా ఆడారు. క్రిస్‌ లిన్‌, శుభ్‌మన్‌ గిల్‌ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నారు. మొదటి మూడు ఓవర్లు మేం బాగానే కట్టడి చేశాం. చిన్నచిన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోలేకపోయాం. మా జట్టులో పూరన్‌, సామ్‌ కరణ్‌ మంచి ఇన్నింగ్స్‌ ఆడారు. అతని సామర్థ్యం గురించి మా అందరికీ తెలుసు. రెండు జట్ల మధ్య పవర్‌ప్లేనే తేడా’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు.