అంతర్జాతీయం

రూ.2,000 కోట్లు పక్కనపెట్టిన ఎన్‌ఎస్‌ఈ

దిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ  కొరడా  ఝుళిపించడంతో జాతీయ స్టాక్‌ ఎక్స్‌ఛేంజి అప్రమత్తమైంది. కో లోకేషన్‌ కేసులో సెబీ మిగిలిన తీర్పును అమలు చేయడానికి వీలుగా రూ.2,000 కోట్ల ప్రొవిజన్‌ను 2018 డిసెంబర్‌ నాటికే ఏర్పాటు చేసింది. సెప్టెంబర్‌ 2016 నుంచి కో లొకేషన్‌ సౌకర్యం ద్వారా వచ్చిన నిధులు(కోలొకేషన్‌లో ట్రేడర్లు చేసిన లావాదేవీలపై ఛార్జీల రూపంలో వచ్చిన మొత్తం కలిపి) 1,994.77 కోట్లను ప్రత్యేక బ్యాంక్‌ ఖాతాలో ఉంచాలని సెబీ సూచించింది.
డేటా అక్రమ వినియోగం ద్వారా ఆర్జించిన లాభాల్లోంచి రూ.625 కోట్లు 12% వడ్డీతో కలిపి చెల్లించాలని ఎన్‌ఎస్‌ఈని మంగళవారం రాత్రి సెబీ ఆదేశించింది. అంతేకాదు.. 6 నెలల పాటు కొత్త డెరివేట్‌ ఉత్పత్తులు వేటిని ప్రవేశపెట్టకుండా నిషేధం విధించింది. ఎన్‌ఎస్‌ఈలోని కొందరు మాజీ, ప్రస్తుత ఉన్నతాధికారులపైనా కొరడా ఝుళిపించడమే కాక, ఇంకొందరు స్టాక్‌ బ్రోకర్లపై కఠిన చర్యలకు ఆదేశించింది.హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్‌ ద్వారా కొన్ని సంస్థలకు అనుచిత లబ్ధి చేకూరిందన్నది ఈ కేసు ద్వారా తేల్చింది. సెక్యూరిటీల మార్కెట్‌లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లావాదేవీలు నెరపకుండా 6 నెలల పాటు ఎన్‌ఎస్‌ఈపై నిషేధం విధించింది. అంటే ఎక్స్ఛేంజీ తరఫున షేర్లు, బాండ్ల వంటివి కొనకుండా నిషేధం వర్తిస్తుంది.