జాతీయం

రిలయన్స్‌పై లీ మాండె కథనం తప్పు’

న్యూదిల్లీ: రఫేల్‌ కోసం అనిల్‌ అంబానీకి లబ్ధి చేకూర్చినట్లు లీమాండె ప్రచురించిన కథనంపై భారత్‌లోని ఫ్రాన్స్‌ రాయబారి అలెగ్జాండర్‌ జిగ్లర్‌ స్పందించారు. ఆ పత్రిక కథనం పూర్తిగా తప్పని ఆయన వివరణ ఇచ్చారు. ఫ్రాన్స్‌ అధికారులు, రిలయన్స్‌ ఎఫ్‌ఎల్‌ఏజీ సంస్థ మధ్య కుదిరిన అవగాహన మేరకే పన్ను మినహాయింపులు లభించాయన్నారు. ఈ ఒప్పందం కూడా చట్టాలకు, పన్నుల శాఖ నిబంధనలకు లోబడి జరిగిందని పేర్కొన్నారు. దీనిలో ఎటువంటి రాజకీయ లేదా ఇతరత్రా జోక్యాలు లేవని వెల్లడించారు. ఇప్పటికే ఈ విషయాన్ని భారత రక్షణ శాఖ కూడా ఖండించిన విషయం తెలిసిందే.
వివాదాస్పద రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందానికి అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ అనుబంధ సంస్థకు ఫ్రాన్స్‌లో 143.7 మిలియన్‌ యూరోల (ప్రస్తుత కరెన్సీ విలువ ప్రకారం రూ.1,123 కోట్లు) మేర పన్నులు రద్దు చేసినట్లు ఆ దేశానికి చెందిన అగ్రశ్రేణి దినపత్రిక ‘లీ మాండె’ పేర్కొంది. ఫ్రాన్స్‌ నుంచి 36 రఫేల్‌ యుద్ధవిమానాలను కొనుగోలు చేస్తున్నట్లు 2015లో భారత్‌ ప్రకటించిన కొద్ది నెలలకు ఈ వెసులుబాటు లభించిందని వివరించింది. ఈ ఆరోపణలను రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ ఖండించింది.