జాతీయం

రాహుల్‌ ఫిరంగి..నేను ఏకే 47..

సిమ్లా: లోక్‌ సభ ఎన్నికల్లో భాగంగా చివరి దశ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఇందులో భాగంగా నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా పంజాబ్‌ మంత్రి, కాంగ్రెస్ నేత నవ్‌జ్యోత్‌ సింగ్‌..ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో గంగ పుత్రుడిగా చెప్పుకొన్న మోదీ..ఇప్పుడ రఫేల్‌ కుంభకోణానికి ఏజెంట్‌గా మారారని ఆరోపించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

‘రఫేల్‌ ఒప్పందానికి ప్రధాని నరేంద్ర మోదీ బ్రోకర్‌గా పనిచేస్తున్నారేమోనని ఆయనని నిలదీయాలనకుంటున్నాను. నాతో ఆయన దేశంలో ఎక్కడయినా చర్చల్లో పాల్గొనవచ్చు. ఆయనకు నేను సవాలు విసురుతున్నాను. ‘అవినీతి చేయను..ఎవర్నీ చేయనివ్వను’ అన్న మోదీ నినాదంలో ఎంత మాత్రం నిజముందో ఈ చర్చలో తేల్చుకోవాలి. ఈ చర్చల్లో నేను విఫలమయితే..రాజకీయాలను నుంచి తప్పుకొంటాను. గంగ పుత్రుడిగా 2014లో వచ్చిన మోదీ..ఈ ఎన్నికల్లో రఫేల్‌ ఒప్పందానికి ఏజెంట్‌గా మాత్రమే మిగిలిపోతారు. రాహుల్‌లో గెలుపు పట్ల ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఆయన ఫిరంగి అయితే నేను ఏకే 47’ అని అన్నారు.
హిమాచల్‌ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌ సభ స్థానాలకు ఈనెల 19న ఎన్నికలు జరగనున్నాయి. అన్ని దశల ఎన్నికలకు ఈనెల 23న ఫలితాలు వెలువడతాయి.