జాతీయం

రాహుల్‌, చంద్రబాబు భేటీ

దిల్లీ: ఎన్డీయేతర కూటమి బలోపేతమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్న సాయంత్రం దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరితో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఇవాళ ఉదయం ఏపీ భవన్‌లో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజాతో సమావేశమై మే 23 ఎన్నికల ఫలితాల అనంతరం భవిష్యత్‌ కార్యచరణపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఆతర్వాత ఏపీ భవన్‌ నుంచి రాహుల్‌ నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈనెల 19న తుదివిడత పోలింగ్‌ ముగియనుండటంతో ఎన్డీఏకు ఎన్నిసీట్లు వచ్చే అవకాశముంది, యూపీఏకు ఎన్ని సీట్లు వస్తాయి, మే 23 తర్వాత అనుసరించాల్సిన కార్యచరణ.. తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. రాహుల్‌గాంధీతో భేటీ తర్వాత శరద్‌పవార్‌, శరద్‌యాదవ్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు.